'కోపంగా ఏం లేను.. నిరాశ చెందుతున్నా' | Sakshi
Sakshi News home page

'కోపంగా ఏం లేను.. నిరాశ చెందుతున్నా'

Published Wed, Jan 20 2016 6:01 PM

'కోపంగా ఏం లేను.. నిరాశ చెందుతున్నా'

'నేను కోపంగా ఏమి లేను. కానీ, చాలా నిరాశ చెందుతున్నాను. సిరీస్లో గత మ్యాచ్ల కంటే కూడా మేం అద్భుతంగా బ్యాటింగ్ చేసిన వన్డే ఇది. అయినా ఓటమి పాలయ్యాం. జట్టు ఓటమికి బాధ్యత వహిస్తున్నాను. టాప్ ఆర్డర్  పెవిలియన్ చేరినప్పుడు నేను జట్టును నడిపించాలి. కానీ, అవుటయ్యాను. యువకులపై కూడా కాస్త ఒత్తిడి ఉంది. అంతర్జాతీయ మ్యాచ్లు ఒత్తిడితో కూడుకున్నవి. ఒత్తిడిని అధిగమిస్తే విజయం సాధ్యమవుతుంది'...  ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో వన్డే ఓటమి అనంతరం టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యలివి. 

టీమిండియా ఓటమికి తానే నైతిక బాధ్యత వహిస్తున్నట్లు కెప్టెన్ ధోనీ ప్రకటించాడు. ఓపెనర్ శిఖర్ ధావన్(126), విరాట్ కోహ్లీ (106) సెంచరీలతో కదం తొక్కి జట్టు కోసం భారీ భాగస్వామ్యం నమోదు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరు బ్యాటింగ్ చేసిన తీరును ఈ సందర్భంగా ధోనీ ప్రశంసించాడు. మరోవైపు ఐదు వన్డేల సిరీస్లో 4-0 తేడాతో భారత్ ఉండటం తనను నిరాశకు గురి చేసిందన్నాడు.

కాన్బెర్రాలో బుధవారం ఆసీస్తో జరిగిన నాల్గో వన్డేలో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 349 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌట్ అయింది. 277 పరుగుల వరకు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపు దిశగా వెళ్తున్న టీమిండియా చివరి 9 వికెట్లను 46 పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. ఇక ఆసీస్ బౌలర్ రిచర్డ్ సన్ చక్కటి బౌలింగ్ తో తొలిసారి 5 వికెట్లు సాధించాడు.

Advertisement
Advertisement