కోల్‌కతా కాంతులీనేనా! | Sakshi
Sakshi News home page

కోల్‌కతా కాంతులీనేనా!

Published Mon, Apr 2 2018 4:20 AM

Dinesh Karthik relishing captaincy stint with Kolkata Knight Riders - Sakshi

పదేళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఫైనల్‌ చేరిన ప్రతీసారి టైటిల్‌ గెలిచిన జట్టేదైనా ఉందంటే అది ఒక్క కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాత్రమే! ధనాధన్‌ ధోని ఉన్న చెన్నై జట్టు ఆసాధారణ రీతిలో ఆరుసార్లు టైటిల్‌ వేటలో నిలిచినా... కేవలం రెండుసార్లే టైటిల్‌ గెలిచింది. గంభీర్‌ మాత్రం నైట్‌రైడర్స్‌ ‘ఖేల్‌’కథ మార్చేశాడు. రెండుసార్లు చాంపియన్‌గా నిలపడంలో విజయవంతమయ్యాడు. అయితే ఈ సీజన్‌లో ఫ్రాంచైజీ యాజమాన్యం దినేశ్‌ కార్తీక్‌ను నమ్ముకుంది. మరీ ఈ కార్తీక్‌ సేన ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.  

సాక్షి క్రీడావిభాగం :  విజయవంతమైన కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ను వదులుకుని ఈ సీజన్‌కు వికెట్‌ కీపర్‌–బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌కు పగ్గాలు అప్పజెప్పిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ది భిన్నమైన పరిస్థితి. వేలం సందర్భంగా చేతిలో కోట్లున్నా, వ్యూహ లోపంతో సరైన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయిన ఈ జట్టును గాయాలు వేధిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌ ఇలా రెండు విభాగాల్లోనూ ఈసారి స్టార్‌ ఆటగాళ్లు దూరమయ్యేలా ఉన్నారు.

రూ.కోట్లు పెట్టి సొంతం చేసుకున్న ఆండ్రీ రస్సెల్‌ (రూ.8.5 కోట్లు), క్రిస్‌ లిన్‌ (రూ.9.6 కోట్లు) వంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ గాయాల కారణంగా ఎంతవరకు అందుబాటులో ఉంటారో తెలియడం లేదు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ సందర్భంగా సునీల్‌ నరైన్‌ (రూ.12.5 కోట్లు) బౌలింగ్‌ యాక్షన్‌ మరోసారి చర్చనీయాంశమైంది. కీలక పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (రూ.9.4 కోట్లు) గాయంతో ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

దీంతో కోల్‌కతాకు బ్యాటింగ్‌లో కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్, రాబిన్‌ ఊతప్ప, నితీశ్‌ రాణాలతో పాటు అండర్‌–19 ప్రపంచకప్‌ సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ వంటి భారత ఆటగాళ్లే దిక్కయ్యారు. స్టార్క్‌ దూరమైన నేపథ్యంలో యువ పేసర్లు కమలేశ్‌ నాగర్‌కోటి, శివమ్‌ మావి, వెటరన్‌ మిచెల్‌ జాన్సన్‌లు తమ పేస్‌తో గట్టెక్కించాల్సి ఉంటుంది. ఒక జట్టు గరిష్ఠ సభ్యుల సంఖ్య 25 కాగా... వేలంలో అందరికంటే తక్కువగా 19 మందితో సరిపెట్టుకున్న కోల్‌కతా ఇప్పుడు తన నిర్ణయాన్ని తానే నిందించుకోవాల్సిన పరిస్థితి.  

దినేశ్‌ సమర్థుడే... కానీ!
14 ఏళ్ల కెరీర్‌లో దినేశ్‌ కార్తీక్‌కు టీమిండియాలో సుస్థిరమైన స్థానం లేకపోయినా అతని సత్తా, సామర్థ్యాన్ని తక్కువ చేయలేం. ఇటీవలే నిదహాస్‌ ట్రోఫీ (శ్రీలంక ఇండిపెండెన్స్‌ కప్‌)లో ఒక్క ఓవర్‌తో భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టాడు. చివరి బంతికి సిక్స్‌ కొట్టి టైటిల్‌ చేతిలో పెట్టాడు. హిట్టర్‌లకు సరితూగే బ్యాట్స్‌మన్‌ కార్తీక్‌. అంతా ఒకడే పరిగెత్తేందుకు ఇది స్ప్రింట్‌ (అథ్లెటిక్స్‌) కాదు, టీమ్‌ ఆట. మాజీ చాంపియన్‌ జట్టుకు వేలంలో ఫ్రాంచైజీ వేసిన తప్పటడుగులు శాపాలుగా మారవచ్చు. 

చేతిలో సొమ్మున్నా చేవ కలిగిన ఆటగాళ్లపై యాజమాన్యం పెద్దగా మనసు పెట్టలేదు. దీంతో జట్టు కూర్పు సమస్య కాగలదు. ఈ నేపథ్యంలో జట్టు సమతౌల్యం టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు పెను సవాల్‌ విసురుతుంది. సహచరుల సమన్వయం, తోడ్పాటు ఎంతో అవసరమైన క్రికెట్‌ బరిలో దాన్ని ఎంతమేరకు రాబట్టుకొని దినేశ్‌ కార్తిక్‌ ముందంజ వేస్తాడో ఈ 11వ సీజన్‌ తేలుస్తుంది.

ఎవరు కీలకం...
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకించి ఈ సీజన్‌ వరకే చూస్తే... కోల్‌కతా కెప్టెన్‌కు విదేశీ ఆటగాళ్లకంటే స్వదేశీ ఆటగాళ్లే పెద్దదిక్కుగా కనబడుతున్నారు. ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్ప ప్రధాన బ్యాట్స్‌మన్‌ కాగా... కుర్రాళ్లు శుభ్‌మాన్‌ గిల్, నితీశ్‌ రాణా, ఇషాంక్‌ జగ్గీ, రింకూ సింగ్‌లు ఐపీఎల్‌ స్టార్లు అయ్యేందుకు ఈ సీజన్‌ అసలైన వేదిక.

లీగ్‌ దశలో 14 మ్యాచ్‌ల్లోనూ వీళ్లందరికీ ఆడే లక్కీ చాన్స్‌ రావొచ్చు. దీంతో సొంత ప్రేక్షకుల మధ్య మెరుపులు మెరిపించేందుకు ఇంతకు మించిన మరో అవకాశం ఉండదేమో. బౌలింగ్‌లో స్పిన్‌ తురుపుముక్క నరైన్, కుల్దీప్‌ల మాయా జాలంపై కోల్‌కతా ఎక్కువ ఆధారపడింది. ఆల్‌రౌండర్లలో శివమ్‌ మావితో పాటు విదేశీ ఆటగాళ్లు డెల్‌పోర్ట్, సిర్లెస్‌లు రాణిస్తే జట్టు పరిస్థితి మెరుగవుతుంది.

అంతా నే చూసుకుంటా...
నైట్‌రైడర్స్‌ను కనీసం ప్లే ఆఫ్‌ దశకు చేర్చడమే నా లక్ష్యం. గడిచిన పదేళ్లలో ఐదు ఫ్రాంచైజీల (బెంగళూరు, ముంబై, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్‌) తరఫున ఆడాను. యాజమాన్యం నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. గత కెప్టెన్‌ గంభీర్‌ జట్టుకెంతో చేశాడు. నేను కూడా అదేస్థాయిలో జట్టును నడిపించే ప్రయత్నం చేస్తాను.     –దినేశ్‌ కార్తీక్, కెప్టెన్‌   

ఐపీఎల్‌ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మొత్తం 152 మ్యాచ్‌లు ఆడింది. 77 మ్యాచ్‌ల్లో గెలిచి, 69 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగియగా... నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. 2012, 2014లలో టైటిల్‌ గెలిచిన కోల్‌కతా గత రెండు సీజన్‌లలో ప్లే ఆఫ్‌ దశలో వెను దిరిగింది.   

జట్టు: దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), రాబిన్‌ ఉతప్ప, క్రిస్‌ లిన్, ఆండ్రీ రస్సెల్, సునీల్‌ నరైన్, నితీశ్‌ రాణా, శుభ్‌మాన్‌ గిల్, ఇషాంక్‌ జగ్గీ, అపూర్వ్‌ వాంఖడే, రింకూ సింగ్, శివమ్‌ మావి, కామెరాన్‌ డెల్‌పోర్ట్, మిచెల్‌ జాన్సన్, కుల్దీప్‌ యాదవ్, పీయూష్‌ చావ్లా, కమలేశ్‌ నాగర్‌కోటి, వినయ్‌ కుమార్, జవన్‌ సిర్లెస్‌.

Advertisement
Advertisement