పాక్ ను చూసి నేర్చుకోండి! | Sakshi
Sakshi News home page

పాక్ ను చూసి నేర్చుకోండి!

Published Wed, Oct 5 2016 4:53 PM

పాక్ ను చూసి నేర్చుకోండి! - Sakshi

అబుదాబి: వెస్టిండీస్ సీనియర్ ప్లేయర్ డ్వేన్ బ్రేవో వ్యాఖ్యలు దేశ క్రికెట్ బోర్డు(డబ్ల్యూఐసీ)ను తీవ్రనిరాశపరిచాయని, అయితే ఓ ఒక్కరు షాక్ కు గురికాలేదని టీమ్ మేనేజర్ జోయెల్ గార్నర్ అన్నాడు. కోచ్ గా సేవలందించి విజయవంతమైన ఫిల్ సిమ్మన్స్ ను అర్ధాంతరంగా తొలగించడాన్ని విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో తీవ్రంగా విమర్శించగా.. జట్టులోని ఆటగాళ్లపై ఈ ప్రభావం పడుతుందని గార్నర్ ఆందోళన వ్యక్తంచేశాడు. అందులోనూ ప్రస్తుతం పాకిస్తాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో మరో మ్యాచ్ ఉండగానే 2-0తో ఓటమిపాలు కాగా, టీ20 సిరీస్ లోవైట్ వాట్ అయిన విషయాన్ని గుర్తుచేశాడు. బుధవారం మూడో వన్డే జరగనున్న తరుణంలో ఆటగాళ్లను తప్పుదోవ పట్టిస్తున్నాడని బ్రేవోపై ఆరోపణలు చేశాడు. ఆటగాళ్లను మళ్లీ స్కూలు పిల్లల మాదిరిగా ట్రీట్ చేస్తున్నారని బ్రేవో మండిపడ్డ విషయం తెలిసిందే.

సిరీస్ కు ఎలా సన్నధ్దమవ్వాలో, ఆటలో మంచి ప్రదర్శన ఎలా చేయాలో పాక్ జట్టును చూసి నేర్చుకోవాలని గార్నర్ విండీస్ ఆటగాళ్లకు సూచించాడు. ఆటగాళ్లు పాకిస్తాన్ తో సిరీస్ లకు పూర్తిగా సన్నద్ధమయ్యారని అయితే పరిస్థితులకు అనుగుణంగా రాణించలేక వైఫల్యం చెందారని గార్నర్ అభిప్రాయపడ్డాడు.  సెప్టెంబర్ 10, 11 తేదీలలో బార్బడోస్ లో ఆటగాళ్లకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించామని, ఆ తర్వాతే పాక్ తో ఆడే జట్టును ప్రకటించినట్లు చెప్పారు.  ఎన్నో విషయాలపై నోరు విప్పిన మేనేజర్ మాత్రం.. దుబాయ్ కి బయలుదేరే సమయంలో ఏ క్రికెట్ బోర్డ్ అయినా ప్రధాన కోచ్ ను తప్పిస్తుందా అన్న బ్రేవో కామెంట్ పై మాత్రం స్పందించేందుకు నిరాకరించడం గమనార్హం.

Advertisement
Advertisement