Sakshi News home page

మరో టైటిల్ పై ఏమీ చెప్పలేను!

Published Mon, Sep 28 2015 4:09 PM

మరో టైటిల్ పై ఏమీ చెప్పలేను!

మల్లొర్కా(స్పెయిన్): గత పదేళ్లలో తొమ్మిది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లు గెలిచి మట్టికోర్టులో మకుటం లేని మారాజులా ఖ్యాతిగాంచిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తన కెరీయర్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.  మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధిస్తానని కొంతవరకూ నమ్మకం ఉన్నా .. కచ్చితంగా మరో టైటిల్ సాధిస్తానని చెప్పలేనని స్పష్టం చేశాడు.  'నేను మరొక గ్రాండ్ స్లామ్ సాధిస్తానో.. లేదో తెలియదు. కానీ సాధిస్తానని నమ్మకం ఉంది.  కచ్చితంగా టైటిల్ ను గెలుస్తానని మాత్రం చెప్పలేను. టెన్నిస్ కోర్టులో ఆడటాన్ని చాలా ఆస్వాదిస్తా. అది ప్రాక్టీస్ కావొచ్చు.. ముఖాముఖి తలపడటం కావొచ్చు. గతంలో ఏదో సాధించాలని ఆతృత ఉండేది. ఇప్పడది లేదు. నేను బ్రిటన్ స్టార్ ఆటగాడు ఆండ్రీ ముర్రేను  ఎక్కువగా ఇష్టపడతా. ముర్రే ఒక గొప్ప ఆటగాడు. సహజసిద్ధంగా ఉంటాడు. నాకు అలానే ఉండటం ఇష్టం. నా పరంగా చూస్తే ముర్రేకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ' అని నాదల్ తెలిపాడు.

 

ఈ మధ్య కాలంలో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్, సెర్బియా స్టార్ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ లు ముందు వరుసలో దూసుకుపోతున్నా.. అదే స్థాయి ఆటగాడు నాదల్ మాత్రం అనూహ్యంగా వెనుకబడ్డాడు. 2014 ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తరువాత నాదల్ ఖాతాలో మరే గ్రాండ్ స్లామ్ టైటిల్ లేదు.  నాదల్ తన కెరీయర్ లో తొమ్మిది ఫ్రెంచ్ ఓపెన్ లతో పాటు, రెండు వింబుల్డన్ టైటిల్స్, రెండు యూఎస్ ఓపెన్ లు, ఒక ఆస్ట్రేలియా ఓపెన్ లు గెలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement