హేల్స్‌ గెలిపించాడు.. | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 7 2018 2:02 AM

England Won By Five Wickets Against India In 2nd T20 - Sakshi

కార్డిఫ్‌: టీమిండియా విజయాన్ని ఒకే ఒక్కడు అడ్డుకున్నాడు. తక్కువ స్కోరైనా కాపాడుకుంటుందనుకున్న తరుణంలో.. ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ హేల్స్‌(58; 41 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు. టీమిండియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్‌ను ఆతిథ్య జట్టు 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

తడబడిన ఇంగ్లండ్‌..149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను  ధాటిగానే ఆరంభించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను ఉమేశ్‌ విడదీశాడు. ఉమేశ్‌ వరుస ఓవర్లలో రాయ్‌(15), బట్లర్‌(14)లను ఔట్‌ చేయగా, రూట్‌(9)ను చహల్‌ పెవిలియన్‌కు పంపిచాడు. ఆతిథ్య జట్టు 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ, హేల్స్‌ పట్టుదలతో బ్యాటింగ్‌ చేయడం.. అతడికి మోర్గాన్‌(17), బెయిర్‌ స్టో(28)ల నుంచి సహకారం అందడంతో మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేశాడు. టీమిండియా బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ రెండు వికెట్లు పడగొట్టగా, భవనేశ్వర్‌, హార్దిక్‌ పాండ్యా, చహల్‌ తలో వికెట్‌ సాధించారు. 

అంతకముందు  టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కోహ్లి సేన నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కార్డిఫ్‌ పిచ్‌ నెమ్మదైనది కావడంతో పరుగులు చేయడానికి టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఆపసోపాలు పడ్డారు. ఇంగ్లండ్‌ కట్టుదిట్టమైన  పేస్‌ బౌలింగ్‌తో భారత ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని అందించలేకపోయారు. జాక్‌ బాల్‌ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి రోహిత్‌ శర్మ(5) క్యాచ్‌ ఔట్‌ కాగా, నిర్లక్ష్యంతో మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(10) రనౌట్‌గా వెనుదిరిగారు.

ఫస్‌డౌన్‌లో వచ్చిన తొలి మ్యాచ్‌ సెంచరీ హీరో కేఎల్‌ రాహుల్‌(6) విఫలమవ్వటంతో భారత్‌ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(47; 38 బంతుల్లో 1ఫోర్‌, 2 సిక్సర్లు), సురేశ్‌ రైనా(27; 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) ఆదుకునే ప్రయత్నం చేశారు. చివర్లో ఎంఎస్‌ ధోని (32; 24 బంతుల్లో 5 ఫోర్లు), పాండ్యా(12) బ్యాట్‌ ఝళిపించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ నమోదు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో విల్లే, బాల్‌, ప్లంకెట్‌, రషీద్‌ తలో వికెట్‌ సాధించారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఆదివారం జరగనుంది.

Advertisement
Advertisement