ప్రతీకారం తీర్చుకుంటాం | Sakshi
Sakshi News home page

ప్రతీకారం తీర్చుకుంటాం

Published Sat, Feb 4 2017 12:06 AM

English Premier League

నెమాంజా మాటిక్‌ ఇంటర్వూ్

ఈ సీజన్‌కు ముందు అర్సెనల్‌ చేతిలో చెల్సీ జట్టు 0–3తో దారుణంగా ఓడింది. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం చెల్సీకి దక్కింది. ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌)లో భాగంగా నేడు (శనివారం) ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరగబోతోంది. అయితే కచ్చితంగా మా స్థాయి ఆటతీరుతో వారికి బదులిస్తామని చెల్సీ మిడ్‌ఫీల్డర్‌ నెమాంజా మాటిక్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆ ఓటమి అనంతరం చెల్సీ జట్టు లీగ్‌లో ఇప్పటిదాకా కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఓడి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కోచ్‌ ఆంటోనియో కాంటే ఈ మ్యాచ్‌ కోసం వ్యూహాలు మారుస్తున్నారు. ఇక 2014లో చెల్సీ జట్టులో చేరిన 28 ఏళ్ల మాటిక్‌ మరోసారి తన మేజిక్‌ను ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అర్సెనల్‌పై బదులు తీర్చుకుని అప్పటి చేదు అనుభవాన్ని తుడిచేయాలని భావి స్తున్నాడు.

అర్సెనల్‌పై ఇంతకుముందు ఓడటం జట్టుపై కీలక ప్రభావం చూపిందనుకుంటున్నారా?
అవును అది నిజం. నిజంగా ఆ మ్యాచ్‌ ఫలితం మాలో చాలా మార్పును తీసుకువచ్చింది. మమ్మల్ని మరింత జాగ్రత్తగా ఆడేలా చేసిందనడంలో సందేహం లేదు. ఆ తర్వాత మా జట్టు వరుసగా 13 మ్యాచ్‌లు గెలిచింది. ఒక్కోసారి మనం స్పృహలోకి రావాలంటే ఇలాంటి ఓటమి ఎదురుకావాల్సిందే. మరోసారి అలాంటి పరాభవాలను దరిచేరనీయం.

అసలు ఆ మ్యాచ్‌లో ఎలాంటి తప్పులు జరిగాయంటారు?
వాస్తవానికి ఎవరైనా మ్యాచ్‌ ఓడిపోవచ్చు. అయితే ఆ ఓటమిని ఎలా తీసుకుంటారనేది ముఖ్యం. అర్సెనల్‌తో మేం మైదానంలో సరిగా స్పందించలేకపోయాం. అయితే నేటి మ్యాచ్‌ మాత్రం దీనికి విభిన్నంగా ఉండబోతోంది. ఇంత ప్రతిష్టాత్మకమైన క్లబ్‌ తరఫున ఆడుతూ 0–3తో ఓడటాన్ని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం.

ఈసారి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో జట్టు సభ్యులు ఉన్నారా? మీలో అసలు సత్తా ఏమిటో చూపించాలనుకుంటున్నారా?
అవును. ఓ జట్టుగా మా స్థాయి ఏమిటో వారికి చూపించాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌ మా సొంతగడ్డపై జరగబోతోంది. కచ్చితంగా గెలిచేందుకు ప్రయత్నిస్తాం. ఆ జట్టులోనూ నాణ్యమైన ఆటగాళ్లున్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తారు. అయితే మేం మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నాం. అటు అభిమానులు కూడా ఈ మ్యాచ్‌ను ఆస్వాదిస్తారని భావిస్తున్నాను.

అర్సెనల్‌ తమ చివరి మ్యాచ్‌లో వాట్‌ఫోర్డ్‌ చేతిలో ఓడింది. ఇది మీకు అనుకూలిస్తుందను
కుంటున్నారా?

వారి ఓటమి మమ్మల్ని ఆనందపరిచింది. ఈ దశలో వారు పాయింట్లు కోల్పోతారని ఊహించలేదు. అయితే ఈ ప్రీమియర్‌ లీగ్‌లో ఏదైనా సాధ్యమే. ప్రతీ మ్యాచ్‌పై దృష్టి పెడుతూ ముందుకు సాగాల్సి ఉంటుంది.

అర్సెనల్‌పై విజయం సాధిస్తే చెల్సీ జట్టు టైటిల్‌ రేసులో బాగా ముందుకెళుతుంది కదా?
మాపై ఓడి వారు పాయింట్లు కోల్పోతే మంచిదే. ఎందుకంటే ఇంకా 15 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పుడు మేం సీజన్‌ రెండో భాగంలో ఉన్నాం. ఇక్కడ ప్రతీ పాయింటు ముఖ్యమైనదే. మేం గెలిస్తే 12 పాయింట్ల ఆధిక్యంలో ఉంటాం. 

Advertisement
Advertisement