అంతా ఐపీఎలే చేసింది : డూప్లెసిస్‌

24 Jun, 2019 09:38 IST|Sakshi
డూప్లెసిస్‌

లండన్‌ : ప్రపంచకప్‌ ముందు జరిగిన ‌ఐపీఎలే తమ కొంపముంచిందని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డూప్లెసిస్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కొంతమంది ఆటగాళ్లను ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు అనుమతించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. తీవ్ర పని భారంతో తమ ఆటగాళ్లు ఈ మెగాటోర్నీలో రాణించలేకపోయారని తెలిపాడు. ముఖ్యంగా కగిసో రబడ వైఫల్యం తమ జట్టు విజయాలపై ప్రభావం చూపిందన్నాడు. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో సఫారి జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌ ప్రస్థానం లీగ్‌ దశలోనే ముగిసింది.  ఇప్పటి వరకు ఒకటే విజయంతో సరిపెట్టుకున్న సఫారీ ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో సెమీస్‌ అవకాశాల్ని పూర్తిగా కోల్పోయింది. ఈ మ్యాచ్‌ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో తమ పరాజయంపై డూప్లెసిస్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. లీగ్‌ దశలోనే వెనుదిరగడం చాలా ఇబ్బందికరంగా ఉందన్నాడు.

‘మా ఓటమిపై సరైన సమాధానం చెప్పలేకపోతున్నాను. మేం అసలు ఐపీఎల్‌ ఆడకుండా ఉండాల్సింది. కనీసం రబడనైనా అడ్డుకోవాల్సింది. అతను ఐపీఎల్‌ ఆడకుండా ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కేవలం ఐపీఎల్‌ వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందనుకోవడం లేదు. కానీ కొంత మంది ఆటగాళ్లకు విశ్రాంతినిస్తే.. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి తాజాగా బరిలోకి దిగేవారు. విశ్రాంతి లేకుండా ఆడితే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయి. ఇతర పేసర్లు గాయాలు కూడా రబడపై ప్రభావం చూపాయి. అతనొక్కడే భారాన్ని మోసాడు. ఇది అతని బౌలింగ్‌పై ప్రభావం చూపింది. టోర్నీ ఆరంభంలో రాణించకుంటే.. మనపై మనకు ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది. రబడ విషయంలో కూడా అదే జరిగింది. అతను ఎదో ఒకటి చేయాలని చాలా ప్రయత్నించాడు. కానీ ఏం జరగలేదు. ఎదో చేయాలనే తపన రబడ వేసే ప్రతి బంతిలోను, చివరకు బ్యాటింగ్‌ చేసేటప్పుడు కూడా కనిపించింది’ అని డూప్లెసిస్‌ చెప్పుకొచ్చాడు.

6 మ్యాచ్‌ల్లో రబడ 50.83 సగటుతో కేవలం 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. తీవ్ర వర్క్‌లోడ్‌తో అతను రాణించలేకపోయాడు. ఇది దక్షిణాఫ్రికా గెలుపుపై ప్రభావం చూపింది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున 12 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. గాయం నుంచి కోలుకున్న ఆ జట్టు స్టార్‌పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ఐపీఎల్‌లో ఆడటంతో మళ్లీ గాయపడ్డాడు. ఇది కూడా దక్షిణాఫ్రికాపై తీవ్ర ప్రభావం చూపింది.
చదవండి : పాకిస్తాన్‌ గెలిచింది...

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు