ఆ రాత్రి డివిలియర్స్‌ కాల్‌ చేశాడు.. కానీ | Sakshi
Sakshi News home page

ఆ రాత్రి డివిలియర్స్‌ కాల్‌ చేశాడు.. కానీ

Published Tue, Jun 11 2019 11:18 AM

Faf du Plessis Says AB de Villiers Called Me Before World Cup Selection - Sakshi

లండన్‌ : దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ తన పునరాగమన కోరికను జట్టు ప్రకటనకు ఒక రోజు ముందు చెప్పాడని ఆ దేశ కెప్టెన్‌ ఫాఫ్‌ డూప్లెసిస్‌ తెలిపాడు. సరిగ్గా ప్రపంచకప్‌ జట్టు ప్రకటనకు ముందు రోజు రాత్రి డివిలియర్స్‌ తనకు కాల్‌ చేశాడని కానీ అప్పటికే ఆలస్యం చేసావని తనకు చెప్పినట్లు వారి మధ్య జరిగిన సంభాషణను వివరించాడు.  సోమవారం వెస్టిండీస్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షంతో రద్దైన అనంతరం డూప్లెసిస్‌ మీడియాతో మాట్లాడాడు.(చదవండి : వస్తానంటే... వద్దన్నారు)

‘ప్రపంచకప్‌ జట్టును ప్రకటించే ముందు రోజు రాత్రి డివిలియర్స్‌ నాకు ఫోన్‌ చేశాడు. చాలా ఆలస్యం చేశావని చెప్పా. కానీ కోచ్‌, సెలక్టర్లతో మాట్లాడి 99.99 శాతం ఒప్పించే ప్రయత్నం చేస్తానన్నాను.’ అని డూప్లెసిస్‌ చెప్పుకొచ్చాడు. ఏబీకి జట్టులో చోటు దక్కకపోవడంతో తమ మధ్య స్నేహం ఏం చెడదన్నాడు. ‘ఏబీ, నేను ఇప్పటికి మంచి స్నేహితులమే. ఈ వ్యవహారంతో మా స్నేహం ఏం చెడదు. మా ఫ్రెండ్‌షిప్‌ ముందు ఇది చాలా చిన్నవిషయం. అంతా సర్దుకుపోతుంది’ అని తెలిపాడు. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన సఫారీలను వర్షం నిండా ముంచేసింది. కీలక మ్యాచ్‌ రద్దవ్వడంతో డు ప్లెసిస్‌ సేన సెమీస్‌ ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి. అయినా తమ జట్టు ఇంకా బలంగానే ఉందని డూప్లెసిస్‌ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని కనబర్చకపోవడంతో పరాజయాలు ఎదురయ్యాయని, అయినా టోర్నీని ఆస్వాదిస్తున్నామన్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. (చదవండి : హతవిధీ... సఫారీ ఆశలు ఆవిరి!)

అయితే మిస్టర్‌ 360 డివిలియర్స్‌ జట్టులో ఉంటే సఫారీలకు ఈ పరిస్థితి వచ్చేది కాదని మెజార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ డివిలియర్స్‌ను తీసుకోకపోవడం సరైన చర్యేనని సెలక్షన్‌ కమిటీ కన్వీనర్‌ లిండా జొండి సమర్ధించుకున్నాడు. ‘రిటైర్‌ కావొద్దంటూ గతేడాది ఏబీడీని నేను బతిమాలాను. అప్పటికీ ప్రపంచ కప్‌నకు తాజాగా ఉండేలా రాబోయే సీజన్‌ను ప్లాన్‌ చేసుకోమని అవకాశం కూడా ఇచ్చాను. కప్‌ కోసం పరిగణనలో ఉండాలంటే స్వదేశంలో శ్రీలంక, పాకిస్తాన్‌తో సిరీస్‌లు ఆడాలనీ చెప్పాం. అతడు వాటిని పట్టించుకోలేదు. రిటైర్మెంట్‌ ప్రకటనతో తాను ప్రశాంతంగా ఉన్నట్లు చెప్పాడు. తీరా ఏప్రిల్‌ 18న డివిలియర్స్‌ ఆలోచన చెప్పేసరికి మేం షాక్‌ అయ్యాం. అతడి లోటు తీర్చలేనిదే. కానీ, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కొందరు కుర్రాళ్లు తీవ్రంగా శ్రమించారు. వారికి అవకాశం ఇవ్వాల్సిందే. ఏదేమైనా మా నిర్ణయం విధానాల ప్రకారమే తీసుకున్నాం’ అని వివరించాడు. ఇక డివిలియర్స్‌ 2018 మేలో సామాజిక మాధ్యమం ద్వారా సందేశం పంపించి ఉన్నపళంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అలసిపోవడంతో పాటు తనలో తపన లేదంటూ ఈ సందర్భంగా ఏబీడీ పేర్కొన్నాడు. 

Advertisement
Advertisement