నాల్గో పాకిస్తాన్‌ క్రికెటర్‌గా.. | Sakshi
Sakshi News home page

నాల్గో పాకిస్తాన్‌ క్రికెటర్‌గా..

Published Tue, Oct 16 2018 4:41 PM

Fakhar Zaman becomes the fourth Pakistan batsman to be dismissed in the 90s on Test debut - Sakshi

అబుదాబి: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌ ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన ఫకార్‌ జమాన్‌ ఆకట్టుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ నిలకడగా ఆడి జట్టు స్కోరును ముందుకు  తీసుకెళ్లాడు. అయితే ఓపెనర్‌గా దిగిన ఫకార్‌ జమాన్‌(94; 198 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌) తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. ఫలితంగా తొలి మ్యాచ్‌లో తొంభైల్లో ఔటైన నాల్గో పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంతకుముందు అరంగేట్రం మ్యాచ్‌లో తొంభైల్లో ఔటైన పాకిస్తాన్‌ క్రికెటర్లలో అసిమ్‌ కమాల్‌(99), అబ్దుల్‌ ఖాదిర్‌(95), తస్లీమ్‌ అరిఫ్‌(90)లు ఉన్నారు. ఇప్పుడు వారి సరసన ఫకార్‌ జమాన్‌ చేరాడు.

ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో ఫకార్‌ జమాన్‌, మొహ్మద్‌ హఫీజ్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. కాగా, హఫీజ్‌(4) నిరాశపరచగా, ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన అజహర్‌ అలీ(15) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఆపై హారిస్‌ సొహైల్‌, ఆసద్‌ షఫీక్‌, బాబర్‌ అజమ్‌లు డకౌట్‌లుగా పెవిలియన్‌ చేరడంతో పాక్‌ 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో ఫకార్‌ జమాన్‌-సర్ఫరాజ్‌ అహ్మద్‌ల జోడి బాధ్యతాయుతంగా ఆడింది. ఈ జోడి 147 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత ఫకార్‌ జమాన్‌ ఆరో వికెట్‌గా ఔటయ్యాడు.

Advertisement
Advertisement