దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ మృతి | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ మృతి

Published Tue, Jul 28 2015 11:42 PM

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ మృతి

కేప్ టౌన్: జాతి వివక్ష ఆరోషణలపై సుదీర్ఘ కాలం నిషేధం ఎదుర్కొన్న అనంతరం పునరాగమనం చేసిన దక్షిణాఫ్రికా వన్డే క్రికెట్ టీమ్ కు తొలి కెప్టెన్ గా వ్యవహరించిన క్లైవ్ రైస్ (66) మంగళవారం మృతిచెందాడు.  గత కొంతకాలంగా సెప్టికామియా వ్యాధితో బాధపడుతున్న రైస్ ఈ రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

 

రక్తంలో హానికర బ్యాక్టిరియా అధికం కావడంతో రైస్ ఆదివారం అస్వస్థతకు గురైయ్యాడని..   దానిలో భాగంగానే అతన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రైస్ పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు  వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత మార్చి నెలలోనే బ్రెయిన్ క్యాన్సర్ కు  శస్త్రచికిత్స చేయించుకున్న రైస్ మృతిపట్ల ఐసీసీ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. రైస్ సారథ్యంలో ప్రొటీస్ మూడు వన్డేలు మాత్రమే ఆడినా.. అతనొక స్ఫూర్తిదాయక క్రికెటర్ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, దక్షిణాఫ్రికా  మాజీ క్రికెటర్ డేవిడ్ రిచర్డ్ సన్ తెలిపాడు.  1970 నుంచి 20 ఏళ్లకు పైగా నిషేధం ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా..  తిరిగి 1991 లో పునరాగమనం చేసింది. ఆ సమయంలో క్లైవ్ రైస్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా తొలిసారి భారత పర్యటనకు వచ్చింది.

 

25 సంవత్సరాల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన రైస్..  482 మ్యాచ్ ల్లో 26,331 పరుగులు చేశాడు. అతని బెస్ట్ 246 పరుగులు. కాగా బౌలింగ్ లో కూడా రైస్ అసమాన ప్రతిభ కనబరిచాడు. 22.0 కు పైగా సగటుతో 930 వికెట్లు తీసి తనదైన ముద్రవేశాడు.

Advertisement
Advertisement