సెహ్వాగ్, గంభీర్‌లపైనే దృష్టి | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్, గంభీర్‌లపైనే దృష్టి

Published Wed, Oct 2 2013 12:28 AM

సెహ్వాగ్, గంభీర్‌లపైనే దృష్టి

షిమోగా: బ్యాటింగ్ వైఫల్యంతో తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన భారత్ ‘ఎ’ జట్టు రెండో మ్యాచ్ కోసం సిద్ధమైంది. నేటి నుంచి వెస్టిండీస్ ‘ఎ’తో జరగనున్న అనధికార టెస్టులో అమీతుమీ తేల్చుకోనుంది. జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న సీనియర్లు సెహ్వాగ్, గంభీర్, జహీర్‌లు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో అందరి దృష్టి వారిపైనే నెలకొంది. మేటి ఆటగాళ్లు ఉన్న జట్టును చతేశ్వర్ పుజారా ఎలా నడిపిస్తాడన్నదే ఇప్పుడు ఆసక్తికరం. గత 30 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేయని వీరూ ఈ మ్యాచ్‌తోనైనా గాడిలో పడాలని భావిస్తుండగా... గంభీర్ కూడా సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఎన్‌కేపీ సాల్వే చాలెంజర్ ట్రోఫీలో ఈ ఇద్దరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
 
 
 దీంతో వీరిద్దరి భవిష్యత్‌కు ఈ మ్యాచ్ పరీక్షగా నిలవనుంది. ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన జహీర్ కూడా సరైన ఫామ్‌లో లేడు. 2011 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఏడు టెస్టులు ఆడిన అతను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఈ ముగ్గురిపై ఒత్తిడి నెలకొంది. అయితే అంతర్జాతీయ వేదికలపై విశేష అనుభవం ఉన్న ఈ ముగ్గురు ఆకట్టుకుంటే రాబోయే విండీస్ సిరీస్‌కు జట్టు ఎంపిక చేయడం సెలక్టర్లకు కత్తిమీద సామే. మంగళవారం ప్రాక్టీస్ సందర్భంగా సెహ్వాగ్ వేలికి గాయమైంది. అయితే వీరూ అందుబాటులో ఉండేదీ లేనిదీ మ్యాచ్‌కు ముందే తెలుస్తుందని కెప్టెన్ పుజారా చెప్పాడు.
 
  షెల్డన్ జాక్సన్, నాయర్, డోగ్రా, ఉదయ్ కౌల్, కైఫ్‌లు బ్యాటింగ్‌లో రాణిస్తే భారీ స్కోరు ఖాయం. తొలి టెస్టులో పుజారాతో పాటు బౌలింగ్‌లో ఈశ్వర్ పాండే, మహ్మద్ షమీలు విఫలం కావడం మేనేజ్‌మెంట్‌ను ఆందోళనలో పడేసింది. మరోవైపు తొలి మ్యాచ్ విజయంతో విండీస్ జట్టులో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్, గంభీర్, జహీర్‌లను ఎదుర్కోవడంపైనే ఆ జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కెప్టెన్ కిర్క్ ఎడ్వర్డ్స్, బ్రాత్‌వైట్, పుదాదిన్‌లతో పాటు పావెల్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. భారత పరిస్థితుల్లో విండీస్ స్సిన్నర్లు తమ మ్యాజిక్‌ను ప్రదర్శిస్తున్నారు. మిల్లర్, పెరుమాల్‌ల నిలకడ వాళ్లకు లాభిస్తోంది.
 

Advertisement
Advertisement