మట్టి కోటలో కొత్త రాణి | Sakshi
Sakshi News home page

మట్టి కోటలో కొత్త రాణి

Published Sun, Jun 5 2016 12:11 AM

మట్టి కోటలో కొత్త రాణి

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ముగురుజా
ఫైనల్లో సెరెనాపై సంచలన విజయం
రూ. 15 కోట్ల 18 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
 

‘ఈ ఓటమి గురించి బాధపడకు. ఏనాటికైనా నీవు గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తావు’... గతేడాది వింబుల్డన్ ఫైనల్లో ముగురుజాపై నెగ్గిన తర్వాత సెరెనా విలియమ్స్ తన ప్రత్యర్థి ఆటతీరుపై చేసిన వ్యాఖ్య ఇది. ఏడాది  కాకుండానే సెరెనా అంచనా నిజమైంది. స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజా గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించింది. ఎర్ర మట్టి కోర్టులపై జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ స్పెయిన్ అమ్మాయి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

హోరాహోరీగా సాగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించిన ముగురుజా కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. మరోవైపు 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గి స్టెఫీ గ్రాఫ్ రికార్డును సమం చేయాలని ఆశించిన సెరెనాకు నిరాశే మిగిలింది.
 

 
పారిస్:
గత తొమ్మిదేళ్లుగా వస్తోన్న ఆనవాయితీ ఈసారీ కొనసాగింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ టైటిల్ నిలబెట్టుకోవడంలో మళ్లీ విఫలమైంది. అంచనాలకు మించి రాణించిన స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజా... అద్వితీయ ఆటతీరుతో అదుర్స్ అనిపించింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా అవతరించింది. శనివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ ముగురుజా 7-5, 6-4తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)పై సంచలన విజయం సాధించింది. ఈ విజయంతో 22 ఏళ్ల ముగురుజా తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా క్లే కోర్టులపై ఆడిన తొలి ఫైనల్లోనే ట్రోఫీని దక్కించుకుంది.

విజేతగా నిలిచిన ముగురుజాకు 20 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 18 లక్షలు)... రన్నరప్ సెరెనాకు 10 లక్షల యూరోలు (రూ. 7 కోట్ల 59 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

రెండేళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్‌లో సెరెనాను ఓడించి పెను సంచలనం సృష్టించిన ముగురుజా గతేడాది వింబుల్డన్ ఫైనల్లో ఈ అమెరికా స్టార్ చేతిలో ఓడిపోయింది. అయితే వింబుల్డన్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ముగురుజా ఈసారి పక్కా ప్రణాళికతో ఆడి సెరెనాకు ఓటమి రుచి చూపించింది.


 నాలుగు ఏస్‌లు సంధించి, తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు చేసిన ముగురుజా కీలకదశల్లో సెరెనా సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేయడం తుది ఫలితంపై ప్రభావం చూపింది. ముగురుజా కంటే ఎక్కువ విన్నర్స్ కొట్టినా... తక్కువ అనవసర తప్పిదాలు చేసినా... సెరెనా తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.

తొలి సెట్ ఐదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముగురుజా తన సర్వీస్‌ను కాపాడుకొని 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఎనిమిదో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా స్కోరును 4-4తో సమం చేసింది. 11వ గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముగురుజా తన సర్వీస్‌నూ కాపాడుకోవడంతో సెట్‌ను దక్కించుకుంది.

రెండో సెట్‌లోనూ ముగురుజా నిలకడగా ఆడింది. సెరెనాపై ఒత్తిడిని కొనసాగించింది. దాంతో ఈ సెట్‌లోనూ సెరెనా రెండుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఈ అమెరికా స్టార్ తేరుకోలేకపోయింది.

1998లో అరంటా శాంచెజ్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ క్రీడాకారిణిగా ముగురుజా గుర్తింపు పొందింది.

తాజా విజయంతో సోమవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ముగురుజా రెండో స్థానానికి ఎగబాకుతుంది. 2000లో అరంటా శాంచెజ్ తర్వాత మరోసారి ఓ స్పెయిన్ క్రీడాకారిణి రెండో ర్యాంక్‌ను అందుకోవడం ఇదే ప్రథమం.

చివరి మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో ముగ్గురు కొత్త విజేతలు రావడం విశేషం. గతేడాది యూఎస్ ఓపెన్‌లో ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)... ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), ఫ్రెంచ్ ఓపెన్‌లో ముగురుజా టైటిల్స్ సాధించారు.

గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో సెరెనాను ఓడించిన ఆరో క్రీడాకారిణిగా ముగురుజా నిలిచింది. గతంలో వీనస్ (2001 యూఎస్, 2008 వింబుల్డన్), షరపోవా (2004 వింబుల్డన్), సమంతా స్టోసుర్ (2011 యూఎస్ ఓపెన్), ఎంజెలిక్ కెర్బర్ (2016 ఆస్ట్రేలియన్ ఓపెన్) మాత్రమే సెరెనాను గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడించారు.
 
ఈ విజయాన్ని మాటల్లో వర్ణించలేను. ఇంతకాలం నేను పడిన శ్రమకు ఫలితం వచ్చింది. క్లే కోర్టులపై ఆడుతూనే పెరిగాను. ఈ గెలుపు నాతోపాటు స్పెయిన్‌కు ఎంతో ప్రత్యేకం. వచ్చే ఏడాది మళ్లీ ఇక్కడకు వస్తాను -ముగురుజా
 

Advertisement
Advertisement