జొకోవిచ్... ఈసారైనా! | Sakshi
Sakshi News home page

జొకోవిచ్... ఈసారైనా!

Published Sun, May 22 2016 12:50 AM

జొకోవిచ్... ఈసారైనా!

 నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్
 
పారిస్: కొన్నేళ్లుగా ఊరిస్తోన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను ఈసారైనా నెగ్గాలనే లక్ష్యంతో నొవాక్ జొకోవిచ్... ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు సెరెనా విలియమ్స్... ఈ నేపథ్యంలో టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ ఆదివారం మొదలుకానుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా)... రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ఫేవరెట్స్‌గా ఉన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్... ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం గత నాలుగేళ్లలో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఈసారి జొకోవిచ్ విజేతగా నిలిస్తే పురుషుల టెన్నిస్ చరిత్రలో ‘కెరీర్ స్లామ్’ పూర్తి చేసుకున్న ఎనిమిదో క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ గాయం కారణంగా ఈసారి బరిలోకి దిగడంలేదు.


మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున సెరెనా ఈసారి టైటిల్ నిలబెట్టుకోవాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది. సెరెనాతోపాటు అజరెంకా (బెలారస్), మాజీ చాంపియన్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), రెండో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)లను తక్కువ అంచనా వేయలేము. డోపింగ్‌లో పట్టు బడ్డ రష్యా స్టార్ షరపోవా టోర్నీలో ఆడటంలేదు.
 
 మధ్యాహ్నం గం. 2.30 నుంచి నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 

Advertisement
Advertisement