పరాభవం పరిపూర్ణం | Sakshi
Sakshi News home page

పరాభవం పరిపూర్ణం

Published Sat, Feb 1 2014 12:43 AM

పరాభవం పరిపూర్ణం

దక్షిణాఫ్రికాలో మొదలైన భారత పరాజయాలు... కివీస్ గడ్డపై పరిపూర్ణమయ్యాయి. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ విఫలమైన ధోనిసేన ఆఖరి వన్డేలోనూ ఓటమిపాలైంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టిన కివీస్ 4-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. గత రెండు నెలల నుంచి విజయం కోసం మొహం వాచిపోయిన టీమిండియా ఇక టెస్టు సిరీస్‌లో ఏం చేస్తుందో?
 
 వెల్లింగ్టన్: ఎన్నో ఆశలతో న్యూజిలాండ్ పర్యటనను మొదలుపెట్టిన భారత్... వరుస పరాజయాలతో మూడు దశాబ్దాల కిందటి చరిత్రను పునరావృతం చేసింది. 1980-81 సీజన్‌లో న్యూజిలాండ్‌లో మనోళ్లు ఒక్క వన్డే కూడా గెలవలేదు. ఆ తర్వాత ఎప్పుడు వెళ్లినా సిరీస్ ఫలితం ఎలా ఉన్నా... కనీసం ఒకట్రెండు మ్యాచ్‌లైనా గెలిచారు. ఇంతకాలానికి ఆ చెత్త రికార్డును ధోనిసేన మళ్లీ తిరగరాసింది. ప్రపంచ చాంపియన్, నంబర్‌వన్ హోదాలతో కివీస్ పర్యటనకు వెళ్లి చిత్తుగా ఓడిపోయింది. వెస్ట్‌ప్యాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఆఖరి వన్డేలో న్యూజిలాండ్ 87 పరుగులతో భారత్‌ను ఓడించింది.
 
 
 దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మెకల్లమ్‌సేన 4-0తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 303 పరుగులు చేసింది. టేలర్ (106 బంతుల్లో 102; 10 ఫోర్లు, 1 సిక్సర్) వరుసగా రెండో సెంచరీ చేయగా, విలియమ్సన్ (91 బంతుల్లో 88; 8 ఫోర్లు, 1 సిక్సర్) సిరీస్‌లో వరుసగా ఐదో అర్ధసెంచరీ చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటై ఓడింది. కోహ్లి (78 బంతుల్లో 82; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. ధోని (72 బంతుల్లో 47; 3 ఫోర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు.
 
 టేలర్ మరో సెంచరీ
 ఆరంభంలో వికెట్‌పై ఉండే తేమను చక్కగా సద్వినియోగం చేసుకున్న భారత పేసర్లు... కివీస్ ఓపెనర్లు గుప్టిల్ (35 బంతుల్లో 16; 2 ఫోర్లు), రైడర్ (26 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్సర్)ను ఇబ్బంది పెట్టారు. దీంతో తొలి 10 ఓవర్లలో కేవలం 31 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే ఈ సిరీస్‌లో విశేషంగా రాణిస్తున్న విలియమ్సన్, టేలర్ మిడిల్ ఓవర్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 152 పరుగులు జోడించి గట్టి పునాది వేయగా... చివర్లో బి.మెకల్లమ్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్సర్), నీషమ్ (19 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. టేలర్, మెకల్లమ్ నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఆరోన్ 2, షమీ, భువనేశ్వర్, కోహ్లి తలా ఓ వికెట్ తీశారు.
 
 కోహ్లి మినహా...
 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్‌లో కోహ్లి, ధోని మినహా మిగతా వారు పూర్తిగా నిరాశపర్చారు. రోహిత్ (13 బంతుల్లో 4), ధావన్ (18 బంతుల్లో 9; 1 ఫోర్), రహానే (10 బంతుల్లో 2), రాయుడు (40 బంతుల్లో 20; 2 ఫోర్లు) వరుస విరామాల్లో అవుట్ కావడంతో భారత్ 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
 
 
 అయితే కోహ్లి, ధోని ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. కోహ్లి అవుటైన తర్వాత ధోని నిలకడగా ఆడినా... రెండో ఎండ్‌లో సహకారం కరువైంది. అశ్విన్, జడేజాలు కీలక సమయంలో అవుట్ కావడంతో భారత్ కోలుకోలేకపోయింది. భారత్ 49 పరుగుల తేడాలో చివరి ఐదు వికెట్లను చేజార్చుకుంది. కివీస్ కొత్త కుర్రాడు హెన్రీ 4 వికెట్లతో అదరగొట్టాడు. మిల్స్, విలియమ్సన్ చెరో రెండు వికెట్లు తీశారు.
 
 ధోని @8,000
 వన్డేల్లో వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా ధోని (214 ఇన్నింగ్స్) రికార్డులకెక్కాడు. కివీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో 26వ ఓవర్ వద్ద మహీ ఈ ఘనతను అందుకున్నాడు. సచిన్, గంగూలీ, లారాలు ఈ జాబితాలో ముందున్నారు.
 
 భారత్ ఈ మూడేళ్లలో విదేశీ గడ్డపై  చాంపియన్స్ ట్రోఫీ మినహా  అన్ని సిరీస్‌ల్లోనూ విఫలమైంది.
 
 ఆడిన చివరి 36 వన్డేల్లో భారత్ 16 గెలిచింది. అందులో 5 మ్యాచ్‌లు జింబాబ్వేపైనే నెగ్గడం
 గమనార్హం.
 
 ‘ఓటములన్నీ నిరాశనే కలిగిస్తాయి. చివరి రోజు ఆ నిరాశ ఎంతంటే చెప్పలేం. అనుభవం లేకపోవడం ఓటమికి కారణం కాదు. న్యూజిలాండ్ తమ ప్రణాళికలను సమర్థంగా అమలు చేసింది. సవాళ్లను ఎదుర్కొనే సత్తా మా జట్టుకు ఉంది. ఇక టెస్టు సిరీస్‌పై దృష్టి పెడతాం’     - ధోని
 
 7 వన్డేల్లో 8 వేల పరుగులు పూర్తి చేసిన ఏడో భారత బ్యాట్స్‌మన్ ధోని
 
 1 భారత్‌పై 4-0తో సిరీస్ గెలవడం కివీస్‌కు ఇది తొలిసారి
 
 2 వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో అర్థసెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్ విలియమ్సన్. గతంలో యాసిర్ హమీద్ (పాక్) ఈ ఫీట్‌ను సాధించాడు.
 
 3 8 వేల పరుగులు, 300 వికెట్లలో భాగస్వామ్యం ఉన్న మూడో కీపర్ మహీ
 
 5 సిరీస్‌లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం ఐదోసారి
 
 స్కోరు వివరాలు
 న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గుప్టిల్ (సి) షమీ (బి) ఆరోన్ 16; రైడర్ (సి) రహానే (బి) భువనేశ్వర్ 17; విలియమ్సన్ (సి) రహానే (బి) ఆరోన్ 88; టేలర్ (సి) ధావన్ (బి) షమీ 102; బి.మెకల్లమ్ (సి) రోహిత్ (బి) కోహ్లి 23; నీషమ్ నాటౌట్ 34; రోంచీ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (50 ఓవర్లలో 5 వికెట్లకు) 303.
 
 వికెట్లపతనం: 1-22; 2-41; 3-193; 4-243; 5-274
 బౌలింగ్: షమీ 10-3-61-1; భువనేశ్వర్ 8-0-48-1; ఆరోన్ 10-0-60-2; అశ్విన్ 6-0-37-0; జడేజా 9-0-54-0; కోహ్లి 7-0-36-1.
 
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) టేలర్ (బి) మిల్స్ 4; ధావన్ (సి) ఎన్.మెకల్లమ్ (బి) హెన్రీ 9; కోహ్లి (సి) (సబ్) యంగ్ హస్బండ్ (బి) ఎన్.మెకల్లమ్ 82; రహానే ఎల్బీడబ్ల్యు (బి) హెన్రీ 2; రాయుడు (సి) విలియమ్సన్ (బి) హెన్రీ 20; ధోని (సి) నీషమ్ (బి) విలియమ్సన్ 47; అశ్విన్ (బి) విలియమ్సన్ 7; జడేజా (సి) గుప్టిల్ (బి) మిల్స్ 5; భువనేశ్వర్ (సి) రోంచీ (బి) హెన్రీ 20; షమీ నాటౌట్ 14; ఆరోన్ (బి) నీషమ్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (49.4 ఓవర్లలో ఆలౌట్) 216.
 వికెట్లపతనం: 1-8; 2-20; 3-30; 4-78; 5-145; 6-167; 7-174; 8-181; 9-215; 10-216
 
 బౌలింగ్: మిల్స్ 10-1-35-2; మెక్లీనగన్ 10-0-45-0; హెన్రీ 10-1-38-4; నీషమ్ 5.4-0-45-1; ఎన్.మెకల్లమ్ 10-1-33-1; విలియమ్సన్ 4-0-19-2.
 

Advertisement
Advertisement