ధోని జట్టులో గంభీర్‌? | Sakshi
Sakshi News home page

ధోని జట్టులో గంభీర్‌?

Published Sun, Jan 7 2018 6:35 PM

Gautam Gambhir to join MS Dhoni's Chennai Super Kings? - Sakshi

ముంబై: ఇటీవల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) రిటెయిన్‌ ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్‌ ధోని, సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజాలను చెన్నై సూపర్‌ కింగ్స్‌ అంటిపెట్టుకోగా, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, బూమ్రాలను ముంబై ఇండియన్స్‌ నిలుపుకుంది. అయితే సారథిగా రెండు టైటిళ్లు సాధించిపెట్టిన గౌతం గంభీర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వదులుకుంది.

అయితే తాజాగా గౌతం గంభీర్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌  కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉందనే వార్త హాట్‌ టాపిగ్‌గా మారింది. కోల్‌కతా వదిలేసిన గంభీర్‌ను వేలంలో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేస్తుందనే అనుమానం ఒక అభిమానికి వచ్చింది. ఈ సారి గౌతమ్‌ గంభీర్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ తీసుకుంటుందని తనకు గాఢంగా అనిపిస్తోందని సీఎస్‌కేకు ట్యాగ్‌ చేస్తూ అభిమాని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. అందుకు ప‍్రతిస్పందనగా సీఎస్‌కే స్మైల్‌తో కూడిన రెండు ఎమిటోకాన్స్‌ తిరిగి పోస్ట్‌ చేసింది. దాంతో గంభీర్‌ను తీసుకోవడానికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ తనవంతు ప్రయత్నం చేయబోతుందా? అనే సందేహం అభిమానులకు కలుగుతుంది. మౌనం అర్ధాంగీకారం అనే రీతిలో చెన్నై వ్యవహరించడమే ఇందుకు మరింత బలాన్నిస్తుంది. ఈనెల 27, 28 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్‌–11 వేలం కార్యక్రమం జరుగుతుంది.


గంభీర్‌కు ధోని మద్దతు ఉంటుందా..?

ఒకవేళ గంభీర్‌ను కొనుగోలు చేయడానికి సీఎస్‌కే ముందుకొచ్చినా అందుకు ధోని ఆమోదం తప్పకుండా కావాలి. గతంలో ధోనితో గంభీర్‌ వ్యహరించిన తీరు ఇప్పటికీ అభిమానుల​ మదిలో మెదులుతూనే ఉంది. తాను జట్టులో స్థానం కోల్పోవడానికి ధోనినే కారణమని భావించిన గంభీర్‌.. ఎప్పుడూ అంత సఖ్యతగా వ్యహరించిన దాఖలాలు లేవు. ఒకానొక సందర్బంలో వీరి వివాదం తారాస్థాయికి చేరింది.  దాదాపు మూడేళ్ల క‍్రితం విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జార్ఖండ్-ఢిల్లీ జట్ల మధ్య బెంగళూరులో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ద్వారా వీరి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.  జార్ఖండ్ చివరి వికెట్ పడిన అనంతరం ఢిల్లీ విజయానందంలో మునిగింది.

ఈ క్రమంలోనే అందరి జార్ఖండ్ ఆటగాళ్లను షేక్ హ్యాండ్ తో విష్ చేసిన గంభీర్.. ధోనిని మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ధోని విష్ చేయడానికి ప్రయత్నించినా గంభీర్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. కనీసం ఆటగాళ్లంతా పెవిలియన్ కు చేరుతున్న సమయంలో కూడా ధోనితో గంభీర్ మాట్లాడటకపోవటం వారి మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయనడానికి ఈ ఘటన అద్దం పట్టింది. అయితే అటు తరువాత ధోనిపై అనేకసార్లు గంభీర్‌ ప్రశంసలు వర్షం కురిపించిన సందర్బాలు కూడా ఉన్నాయి. టీమిండియాలో అత్యుత్తమ ఫినిషర్‌ ఎవరైనా ఉన‍్నారంటే అది ధోనినే అంటూ గంభీర్‌ కొనియాడాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో గంభీర్‌ను కొనుగోలు చేయడానికి ధోని నిర్ణయం తప్పనిసరి కావొచ్చు. ఐపీఎల్లో ఆటగాడిగా, కెప్టెన్‌గా సక‍్సెస్‌ అయిన గంభీర్‌కు ధోని మద్దతు ఉంటుందా?అనేది ఆసక్తికరం.

Advertisement

తప్పక చదవండి

Advertisement