మహిళల కోచ్‌ పురుషులకు... | Sakshi
Sakshi News home page

మహిళల కోచ్‌ పురుషులకు...

Published Sat, Sep 9 2017 1:19 AM

మహిళల కోచ్‌ పురుషులకు...

భారత హాకీ జట్టు చీఫ్‌ కోచ్‌గా జియోర్డ్‌ మరీజినే
హాకీ ఇండియా ఆశ్చర్యకర నిర్ణయం
2020 ఒలింపిక్స్‌ వరకు బాధ్యతలు
మాజీల విమర్శ
 

న్యూఢిల్లీ: పురుషుల సీనియర్‌ హాకీ జట్టు కొత్త కోచ్‌ ఎంపికపై హాకీ ఇండియా (హెచ్‌ఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న జియోర్డ్‌ మరీజినేను పురుషుల సీనియర్‌ జట్టుకు ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.  నెదర్లాండ్స్‌కు చెందిన మరీజినేకు గతంలో ఏ పురుషుల సీనియర్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన అనుభవం లేదు. ఈ బాధ్యతల కోసం హెచ్‌ఐ ఇటీవలే తమ వెబ్‌సైట్‌లో దరఖాస్తులను కోరుతూ ఈనెల 15న తుది గడువు విధించింది. అయితే అంతలోనే మనసు మార్చుకుని నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. కొన్ని నెలలుగా హాకీ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నెదర్లాండ్స్‌కే చెందిన రోలంట్‌ ఓల్ట్‌మన్స్‌ను కోచ్‌ పదవి నుంచి హాకీ ఇండియా తొలగించించింది. మరోవైపు జూనియర్‌ టీమ్‌ కోచ్‌గా ఉన్న హరేంద్ర సింగ్‌ను మహిళల సీనియర్‌ జట్టు హై పెర్ఫామెన్స్‌ స్పెషలిస్ట్‌ కోచ్‌గా నియమించారు. హరేంద్ర సింగ్‌కు గతంలో ఏ స్థాయిలోనూ మహిళల జట్టుకు కోచింగ్‌ ఇచ్చిన అనుభవం లేకపోవడం కూడా మరో ఆశ్చర్యకర విషయం. గురువారం సాయ్, హాకీ ఇండియా మధ్య జరిగిన సంయుక్త సమావేశంలో ఈ ఎంపిక జరిగిందని క్రీడా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు నిర్ణయాలను క్రీడా మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. తొలిసారి ఫెడరేషన్‌నుంచి కాకుండా క్రీడా మంత్రి కోచ్‌ పేరును ప్రకటించడం కూడా అనూహ్యం.  కోచ్‌లు ఇద్దరూ 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌ వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు.  

ముందుగా ఇష్టపడలేదు..
పురుషుల జట్టు కోచ్‌గా ఉండేందుకు ముందుగా 43 ఏళ్ల మరీజినే అంతగా ఇష్టపడలేదని సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన మహిళల జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. అయితే హెచ్‌ఐ, ‘సాయ్‌’ మాత్రం అతడినే తగిన వ్యక్తిగా భావించి తనే ఉత్తమ అభ్యర్థిగా నిర్ణయించి చివరికి ఒప్పించగలిగారు. కానీ  రాబోయే 16 నెలల కాలంలో భారత జట్టు కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌తో పాటు ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆడాల్సి ఉంది. దీంతో ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆయన జట్టును ఎలా ముందుకు తీసుకెళతారనే చర్చ ప్రారంభమైంది. అయితే ఆయన ఆధ్వర్యంలోనే నెదర్లాండ్స్‌ మహిళల అండర్‌–21 జట్టు ప్రపంచకప్, సీనియర్‌ మహిళల జట్టు హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీస్‌ (2015)లో స్వర్ణం సాధించింది. 2011–14 వరకు నెదర్లాండ్స్‌ అండర్‌–21 పురుషుల జట్టుకు కోచ్‌గా పనిచేశారు. నిజానికి పురుషుల జట్టుతో హరేంద్ర సింగ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే తను ఈ పదవిపై కూడా ఆశపడ్డారు. గతేడాది ఆయన ఆధ్వర్యంలోనే జూనియర్‌ జట్టు ప్రపంచకప్‌ను నెగ్గింది.

కొత్త కోచ్‌ ఎంపికపై మాజీల విమర్శలు
సీనియర్‌ పురుషుల జట్టు కోచ్‌గా మరీజినే నియామకంపై హాకీ మాజీ ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. ఇది హాకీ ఇండియా మతిలేని నిర్ణయంగా మాజీ కెప్టెన్‌ అజిత్‌పాల్‌ సింగ్‌ అభివర్ణించారు. ‘నా దృష్టిలో ఇదో చెత్త నిర్ణయం. మరీజినేకు గతంలో సీనియర్‌ పురుషుల జట్టుతో పనిచేసిన అనుభవం లేదు. పైగా భారత ఆటగాళ్ల గురించి పెద్దగా ఆయనకేమీ తెలీదు. ఇక హరేంద్ర సింగ్‌ను తీసుకెళ్లి మహిళా జట్టు బాధ్యతలు ఇచ్చారు. ఆయనకు కూడా వారితో కలిసి పనిచేసిన అనుభవం లేదు. ఇప్పటికే ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యే ప్రక్రియ ప్రారంభమైంది. వారు సెటిల్‌ కావాలంటే తగిన సమయం కావాల్సి ఉంటుంది.

నిజానికి ఓల్ట్‌మన్స్‌ హయాంలో భారత జట్టు చాలా మెరుగైంది. ఆయన ఉద్వాసన సరైనది కాదు. హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీస్‌లో మలేసియా, కెనడా జట్లతో ఓటమి ఆయనపై ప్రభావం చూపినట్టుంది’ అని అజిత్‌పాల్‌ తెలిపారు. అలాగే మరీజినే కన్నా హరీందర్‌ సింగ్‌ కోచ్‌గా ఉంటే బావుండేదని మాజీ ఆటగాడు ధన్‌రాజ్‌ పిళ్లై అభిప్రాయపడ్డారు. హాకీ ఇండియా కేవలం విదేశీ కోచ్‌లంటేనే ఇష్టపడుతోందని అన్నారు. దరఖాస్తుల ఆహ్వానం పేరిట హెచ్‌ఐ డ్రామా ఆడిందని, చాలా మంది ఔత్సాహికులు కోచ్‌ పదవిపై ఆశపడ్డారని మరో మాజీ ఆటగాడు జఫర్‌ ఇక్బాల్‌ అన్నారు.

Advertisement
Advertisement