స్మిత్ మాయాజాలం | Sakshi
Sakshi News home page

స్మిత్ మాయాజాలం

Published Thu, May 19 2016 11:58 PM

స్మిత్ మాయాజాలం - Sakshi

గుజరాత్‌కు కీలక విజయం
6 వికెట్లతో కోల్‌కతా ఓటమి

 
నాలుగు ఓవర్లలో కేవలం ఎనిమిది పరుగులిచ్చి నాలుగు వికెట్లు... ఇదీ డ్వేన్ స్మిత్ బౌలింగ్ జోరు. బ్యాటింగ్‌లో భారీ హిట్టింగ్‌కు పేరున్న స్మిత్ ఈ సారి అత్యుత్తమ బౌలింగ్‌తో సత్తా చాటి గుజరాత్ ప్లే ఆఫ్ ఆశలు నిలబెట్టాడు. పేరుకు తగినట్లుగా గ్రీన్‌పార్క్ బౌలింగ్‌కు అనుకూలించడంతో కోల్‌కతా కుదేలైంది.
 
కాన్పూర్: సురేశ్ రైనా (36 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సారథ్యంలో గుజరాత్ లయన్స్ మరో కీలక విజయాన్ని అందుకుంది. ఇక్కడి గ్రీన్‌పార్క్ స్టేడియంలో గురువారం తొలి సారి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లయన్స్ 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. యూసుఫ్ పఠాన్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, డ్వేన్ స్మిత్ (4-0-8-4) ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. అనంతరం లయన్స్ 13.3 ఓవర్లలో 4 వికెట్లకు 125 పరుగులు చేసింది. సురేశ్ రైనా అర్ధ సెంచరీతో చివరి వరకు నిలిచి మరో 39 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు.  


నాలుగు ఓవర్లలో 4 వికెట్లు: యూసుఫ్ పఠాన్ కొద్దిగా ప్రతిఘటించడం మినహా ఏ దశలోనూ కోల్‌కతా ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి గంభీర్ రనౌట్ కావడంతో జట్టు పతనం మొదలైంది. ఆ తర్వాత  స్మిత్ తన ఒక్కో ఓవర్‌లో ఒక్కో వికెట్‌తో నైట్‌రైడర్స్‌ను చావుదెబ్బ తీశాడు. తన టి20 కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన స్మిత్... ఏకంగా 18 డాట్ బాల్స్ వేయడం విశేషం. ఉతప్ప (19 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం ధాటిని ప్రదర్శించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఒక దశలో గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు 50 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు! లోయర్ ఆర్డర్‌లో కూడా ఎవరూ నిలబడలేకపోవడంతో కోల్‌కతా మోస్తరు స్కోరుకే పరిమితమైంది.


కీలక భాగస్వామ్యం: స్వల్ప లక్ష్యఛేదనలో గుజరాత్ కూడా వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే స్మిత్ (0)ను అవుట్ చేసి రాజ్‌పుత్, కోల్‌కతాకు శుభారంభం అందించాడు. తర్వాతి ఓవర్లో మెకల్లమ్ (6) వెనుదిరగ్గా, దినేశ్ కార్తీక్ (12) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే ఈ దశలో కెప్టెన్ రైనా, ఆరోన్ ఫించ్ (23 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు దూకుడుగా ఆడటంతో చకచకా పరుగులు వచ్చాయి. 36 బంతుల్లోనే ఈ జోడి నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించింది. ఫించ్ వెనుదిరిగినా, రైనా చివరి వరకు నిలబడటంతో జట్టుకు విజయం దక్కింది.


స్కోరు వివరాలు: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) కార్తీక్ (బి) స్మిత్ 25; గంభీర్ (రనౌట్) 8; పాండే (సి) రైనా (బి) స్మిత్ 1; చావ్లా (బి) స్మిత్ 11; పఠాన్ (సి) రైనా (బి) కులకర్ణి 36; షకీబ్ (సి) ద్వివేది (బి) స్మిత్ 3; సూర్య కుమార్ (సి) కులకర్ణి (బి) జకాతి 17; హోల్డర్ (సి) ఫించ్ (బి) బ్రేవో 13; నరైన్ (నాటౌట్) 2; మోర్కెల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 124.

వికెట్ల పతనం: 1-23; 2-34; 3-44; 4-55; 5-61; 6-102; 7-120; 8-122.
బౌలింగ్: ప్రవీణ్ 2-0-12-0; కులకర్ణి 4-0-34-1; స్మిత్ 4-0-8-4; బ్రేవో 4-0-29-1; జకాతి 4-0-22-1; జడేజా 2-0-17-0.


గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) ఉతప్ప (బి) రాజ్‌పుత్ 0; మెకల్లమ్ (ఎల్బీ) (బి) నరైన్ 6; రైనా (నాటౌట్) 53; కార్తీక్ (బి) మోర్కెల్ 12; ఫించ్ (రనౌట్) 26; జడేజా (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (13.3 ఓవర్లలో 4 వికెట్లకు) 125.

 వికెట్ల పతనం: 1-0; 2-18; 3-38; 4-97.
బౌలింగ్: రాజ్‌పుత్ 3-0-35-1; నరైన్ 4-0-30-1; మోర్కెల్ 3.3-0-39-1; హోల్డర్ 2-0-14-0; పఠాన్ 1-0-6-0.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement