శార్దూల్ కు హర్భజన్ అండ | Sakshi
Sakshi News home page

శార్దూల్ కు హర్భజన్ అండ

Published Sat, Sep 2 2017 11:31 AM

శార్దూల్ కు హర్భజన్ అండ

న్యూఢిల్లీ:శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నాల్గో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భారత ఆటగాడు శార్దూల్ ఠాకూర్ ఆరంభపు మ్యాచ్ లోనే విమర్శల పాలయ్యాడు. అయితే అతడు విమర్శలను చవిచూసింది ఆట పరంగా కాదు.. భారత 'జెర్సీ'ని ధరించినందుకు. అది కూడా మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రమే కేటాయించిన పదో నంబర్ జెర్సీని శార్దూల్ వేసుకున్నందుకు.

సచిన్‌ తన కెరీర్ కు వీడ్కోలు చెప్పే సమయంలో గౌరవపూర్వకంగా తాము 10 వ నంబర్‌ జెర్సీకి కూడా రిటైర్మెంట్ చెబుతున్నట్లు బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. ఇక భవిష్యత్తులో ఏ భారత క్రికెటర్ కూడా దాన్ని ధరించడు అంటూ భారత క్రికెట్ బోర్డు గారాలు పోయింది. అయితే తాజాగా ఆ నంబర్ గల జెర్సీని శార్దూల్ కు కేటాయించింది. దాంతో సచిన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు బీసీసీఐ ఈ రకంగా ప్రవర్తించడం వెనుక వారి ఉద్దేశిమేమిటని ప్రశ్నించారు. పనిలో పనిగా శార్దూల్ వెంటనే ఆ జెర్సీని వదులుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిసింది.

కాగా, సచిన్ కు అత్యంత సన్నిహితుడైన వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాత్రం శార్దూల్ కు అండగా నిలిచాడు. శార్దూల్ చేసిన దాంట్లో తప్పేమీ లేదంటూ సచిన్ అభిమానులకు హితబోధ చేసే యత్నం చేశాడు. 'శార్దూల్.. సచిన్ చూస్తూ పెరిగి ఉంటాడు. భారత జట్టుకు ఆడే క్రమంలో అతను పదో నంబర్ జెర్సీని వేసుకోవాలని అనుకుని ఉంటాడు. అది అతని కల కావొచ్చు. ఆ జెర్సీకి ఉన్న ప్రత్యేకత దానిదే. ఎవరో ఒకరు ధరించి ఆడటం వల్ల ఆ జెర్సీ నంబర్ విలువ తగ్గిపోదు. ఇందులో నాకు ఎటువంటి తప్పు కనిపించలేదు. మేమంతా సచిన్ కు గౌరవం ఇస్తా. అతను ఆడుతున్న సమయంలో ఎవరూ పదో నంబర్ ను ధరించే సాహసం చేయలేదు.ఇక్కడ సచిన్ గౌరవాన్ని తగ్గించారని అనుకోవడం లేదు'అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement