అదే నన్ను రాటుదేలేలా చేసింది: హార్దిక్‌ | Sakshi
Sakshi News home page

అదే నన్ను రాటుదేలేలా చేసింది: హార్దిక్‌

Published Tue, Apr 16 2019 4:48 PM

Hardik Admits Suspension Setback Allowed Him To Improve - Sakshi

ముంబై: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ విజయాల్లో ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా తన పవర్‌ బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు హార్దిక్‌. సోమవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 37 పరుగులు చేయడంతో ముంబై ఇంకా ఓవర్‌ ఉండగానే గెలుపును అందుకుంది. చివరి రెండు ఓవర్లలో ముంబై 22 పరుగులు చేయాల్సిన తరుణంలో హార్దిక్‌ 19వ ఓవర్‌లోనే ఆ పరుగులు సాధించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
(ఇక‍్కడ చదవండి: పాండ్యా, రాహుల్‌లకు బీసీసీఐ నోటీసులు)

అయితే తన ప్రదర్శనపై మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. క్రికెట్‌ నుంచి కొన్ని రోజులు సస్పెండ్‌ కావడం తీవ్ర మనో వేదనకు గురి చేసిందన్నాడు. కాగా, ఇదే తనను మరింత రాటు దేలేలా చేసిందని, మానసికంగా మరింత బలోపేతం కావడానికి తనపై విధించిన సస్పెన్షన్‌ ప్రధాన కారణమన్నాడు. ‘ ప్రతీ ఒక్కరి జీవితంలో కష్టకాలం అనేది ఉంటుంది. అలానే నా జీవితంలో కూడా చోటు చేసుకుంది. నాపై సస్పెన్షన్‌ విధించడంతో చాలా సతమతమయ్యా. చాలా రోజులు ఇంట్లోనే ఉండి కుమిలిపోయా. ఇదే నా ప్రదర్శన మెరుగు పడటానికి కారణమైంది. నేను ధృఢంగా మారడానికి అవకాశం కల్పించింది. ఆ సమయం నాకు చాలా క్లిష్టమైనది. కానీ నా మైండ్‌ సెట్‌ను మొత్తం మార్చేసింది. నా ఫిట్‌నెస్‌ లెవెల్‌తో పాటు ఆటపై మరింత దృష్టి పెట్టడానికి కారణమైంది’ అని పాండ్యా పేర్కొన్నాడు.

టీవీ టాక్‌ ‘షో’లో మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, లోకేశ్‌ రాహుల్‌లపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో పాండ్యా, రాహుల్‌ అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడటంతో తీవ్ర వివాదం చెలరేగింది. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో వారిపై నిరవధిక నిషేధం విధించారు. కొన్ని రోజుల తర్వాత వారిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు.
(ఇక‍్కడ చదవండి: వివాదానికి ముందు... వివాదానికి తరువాత...)

Advertisement

తప్పక చదవండి

Advertisement