ఆ ఏడు నెలలు భారంగా గడిచాయి! | Sakshi
Sakshi News home page

ఆ ఏడు నెలలు భారంగా గడిచాయి!

Published Fri, Apr 5 2019 4:12 AM

 Hardik Pandya Heroics in Mumbai Indians Victory - Sakshi

ముంబై: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ గెలుపొందడంలో కీలకపాత్ర పోషించిన ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా... తన జీవితంలో గత ఏడు నెలల కాలం చాలా భారంగా గడిచిందని తెలిపాడు. గాయంతో పాటు, టీవీ షో కారణంగా చెలరేగిన వివాదంతో ఇన్ని రోజుల పాటు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. ‘తాజాగా నా ప్రదర్శన కారణంగా ముంబై గెలుపును అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. కానీ గత ఏడు నెలలు నాకు చాలా కష్టంగా గడిచాయి. అనవసర వివాదాలతో పాటు, గాయంతో ఆటకు దూరమయ్యాను. ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. కానీ ప్రతిరోజు నా ఆటతీరు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించా.

చెన్నైపై నా బ్యాటింగ్‌ ప్రదర్శనతో సంతోషంగా ఉన్నా. కష్ట సమయంలో వెన్నంటే నిలిచిన నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును అంకితమిస్తున్నా. ప్రస్తుతం నా దృష్టి అంతా ఐపీఎల్‌పైనే ఉంది’ అని 25 ఏళ్ల పాండ్యా వివరించాడు. టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీసీసీఐ అతనిపై సస్పెన్షన్‌ వేటు వేసి ఆస్ట్రేలియా పర్యటన నుంచి భారత్‌కు తీసుకువచ్చింది. తర్వాత అతనిపై సస్పెన్షన్‌ ఎత్తివేసినప్పటికీ ఆ అంశంపై ఇంకా విచారణ జరుపుతోంది. ఈ వివాదం కన్నా ముందు పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో భాగంగా బుధవారం మ్యాచ్‌లో 8 బంతుల్లో 25 పరుగులు చేయడమే కాకుండా 3 వికెట్లు దక్కించుకుని మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును అందుకోవడం పట్ల పాండ్యా హర్షం వ్యక్తం చేశాడు.   

Advertisement
Advertisement