భారంగా ఓ ఏడాది..! | Sakshi
Sakshi News home page

భారంగా ఓ ఏడాది..!

Published Sun, Nov 16 2014 12:03 AM

భారంగా ఓ ఏడాది..!

ప్రియమైన సచిన్,
 అప్పుడే నువ్వు ఆటను వదిలేసి ఏడాది గడిచింది. ఇది జీర్ణించుకోవడం ఇంకా కష్టంగానే ఉంది. నీ ఆటను చూస్తూ పెరిగిన మాకు... ఈ ఏడాదంతా నీ జ్ఞాపకాలే సరిపోయాయి. నువ్వు రిటైరైన రోజే... భారతరత్న ప్రకటించగానే మా గుండె సంతోషంగా ఉప్పొంగింది. ఇక మైదానంలో నిన్ను చూడలేమనే బాధ ఆ ఆనందాన్ని మింగేసింది.

 పులి ఎక్కడున్నా పులే... సచిన్ ఆడినా ఆడకున్నా సచినే. అందుకే ఏడాదంతా నీ గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. 24 ఏళ్ల పాటు కుటుంబానికి దూరంగా ప్రపంచం అంతా తిరిగి మాకు వినోదాన్ని పంచిన నీకు ఇక విశ్రాంతి దొరుకుతుందిలే అనుకున్నాం. కానీ నువ్వు మాత్రం కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రపంచం అంతా తిరుగుతున్నావ్.

 ఈ రోజు లండన్‌లో ఉంటే... ఉదయాన్నే కొచ్చిలో కనిపిస్తున్నావ్. ఆ మరుసటి రోజే మరో దేశంలో దర్శనమిస్తున్నావ్. ఇంకా ఇంత ఓపిక ఎక్కడిది. నీకు అలుపే రాదా? ఇప్పటికీ నీ ఇంటికి క్యూ కట్టే స్పాన్సర్లను చూస్తే ఎవరికైనా తెలుస్తుంది నీ విలువ ‘అమూల్యమని'.

 పార్లమెంట్‌కు రాలేదని గగ్గోలు పెట్టే విమర్శకులకేం తెలుసు... నువ్వు బయటే చాలా సేవ చేస్తున్నావని. ‘అప్నాలయా’లోని చిన్నారులకు తెలుసు నీ మనసేమిటో..! ‘యూనిసెఫ్’ అధికారులకు తెలుసు నీ సమయం ఎంత విలువైనదని.

 స్ఫూర్తి నింపడంలో నీకు నువ్వే సాటి. ప్రధాని ‘స్వచ్ఛ భారత్’ అనగానే... వెళ్లి చీపురు పట్టావ్. పుట్టిన రోజు నాడు విహారయాత్రను వదిలేసి వచ్చి మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసి... ఓటు విలువ ఎంతో చెప్పావ్. బైపాస్ సర్జరీ చేయించుకున్న సోదరుడికి సేవలు చేసి కుటుంబానికి అండగా నిలిచావ్. ‘ఎయిర్‌ఫోర్స్ డే’ వేడుకలకు వెళ్లి... దేశం కోసం కష్టపడేవాళ్లను సంతోషపెట్టావ్.

 ఈ ఏడాది మా రాష్ట్రాలకూ బాగానే వచ్చావ్. హైదరాబాద్ ప్యారడైజ్ హోటల్లో, విజయవాడలో మాల్ ఓపెనింగ్‌లో... నువ్వు ఎక్కడకు, ఎప్పుడు వచ్చినా మేం ఈగల్లా ముసురుకున్నాం. అయినా విసుక్కోలేదు. వీలైనంతగా మమ్మల్ని కలిసే ప్రయత్నం చేశావ్. అన్నింటికంటే ముఖ్యంగా మా తెలుగు గ్రామాన్నే దత్తత చేసుకున్నావ్. చాలామంది ఎంపీలు వాళ్ల రాష్ట్రంలోని గ్రామాలకే పరిమితమైతే... నువ్వు మా తెలుగు ప్రజల మీద ప్రేమ చూపించావ్.

 రిటైరయ్యాక ఎనిమిది నెలలకు లార్డ్స్‌లో నువ్వు మళ్లీ వన్డే ఆడితే మా మది పులకించింది. ఆ రోజు నువ్వు బ్యాటింగ్‌కు వస్తుంటే... ఇంగ్లండ్‌లో అభిమానులు నీకు ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ చూసి... ఓ భారతీయుడిగా గర్వించా.

 ఈ దేశం నీ మీద చూపించిన ప్రేమకు రుణం తీర్చుకుంటున్నావ్ అనిపిస్తోంది. ఆటంటే క్రికెట్ ఒక్కటే కాదు... మిగిలిన ఆటలూ బాగా ఎదగాలన్న నీ తపన నీ మీద అభిమానాన్ని మరింత పెంచింది. ఫుట్‌బాల్ కోసం ‘ఐఎస్‌ఎల్’లో భాగం అయ్యావ్. హాకీ జట్టు క్యాంప్‌కు వెళ్లి వాళ్లలో స్ఫూర్తి పెంచావ్. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన వారిని దగ్గరకు వెళ్లి అభినందించావ్.

 నీ కీర్తికిరీటంలో లేని అవార్డులేంటి? అయినా రిటైరయ్యాక నిన్ను పరాయి దేశస్థులూ సత్కరిస్తుంటే ముచ్చటేస్తోంది. ‘బ్రాడ్‌మన్ హాల్ ఆఫ్ ఫేమ్’లో నీకు చోటు దక్కింది. అందులో చోటు నీకు కాకుంటే ఇంకెవరికైనా దక్కుతుందా? నీకంటే అర్హులున్నారా? లేరు.

 ఇదుగో అదిగో అంటుండగానే నీ ఆత్మకథ వచ్చేసింది. గతంలో చాపెల్ అంటే మాకు మంచి అభిప్రాయం లేకపోయినా... ఎప్పుడూ వివాదాల జోలికి పోని నువ్వే చాపెల్‌ను విమర్శించావంటే... మేం అతడిని చీదరించుకున్నాం. నీ జీవితాన్ని తెరచిన పుస్తకం చేసి... నీ అనుభవాల పాఠాలను తర్వాతి తరానికి అందించావ్.

 ‘సచిన్ రిటైరయ్యాక మ్యాచ్‌లు చూడటం మానేశా’... ఇలాంటి మాటలనూ విన్నాం. నువ్వు లేని క్రికెట్‌ను చూడలేమని అనుకుంటూనే... ఆటపై అభిమానాన్ని చూపిస్తూనే ఉన్నాం. లార్డ్స్‌లో మనోళ్లు 28 ఏళ్ల తర్వాత టెస్టు గెలిస్తే సంబరపడ్డాం. రోహిత్ డబుల్ సెంచరీకి చిందులు వేశాం.

 ఇంగ్లండ్‌లో ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లిని నువ్వు దగ్గరుండి పాఠాలు నేర్పించి మళ్లీ గాడిలో పెట్టావ్. అక్కడే మళ్లీ మరోసారి మా మనసు దోచుకున్నావ్. ఒక్క విరాట్‌కే ఎందుకు... మొత్తం భారత క్రికెట్‌కే సరైన నిర్దేశనం చేయొచ్చుగా. అర్జున్‌ను మైదానంలో చూడాలనుకుంటున్నాం. నీకంటే మార్గ నిర్దేశనం చేయగలవారెవ్వరు? కాస్త తన ఆట కోసం సమయం కేటాయించు. వీలైనంత త్వరగా మా ముందుకు తీసుకురా.

 కొంత విశ్రాంతి తర్వాతైనా... మళ్లీ నిన్ను మైదానంలో చూసే అవకాశం కల్పించు. భవిష్యత్‌లో భారత్ కోచ్‌గా నిన్ను చూడాలని ఉంది. నేను సాధారణ సచిన్‌నే అని నువ్వు చెప్పినా... మా క్రికెట్ దేవుడివి మాత్రం నువ్వే. నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నువ్వు ఆటకు దూరమైనా మా మనసులో మాత్రం ఎల్లకాలం ఉంటావు.
     - నీ అభిమాని
 
 (గత ఏడాది సరిగ్గా ఇదే రోజు (నవంబరు 16) సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు)

Advertisement

తప్పక చదవండి

Advertisement