Sakshi News home page

నువ్వేమైనా హర్భజన్ అనుకున్నావా అంటూ!

Published Sat, Jul 22 2017 11:03 AM

నువ్వేమైనా హర్భజన్ అనుకున్నావా అంటూ!

డెర్బీ: పురుష క్రికెటర్లకు ఇచ్చే పారితోషికం మహిళా క్రికెటర్లకు దక్కదు, వారికిచ్చే గౌరవం కూడా ఉండదు, ఇంకా చెప్పాలంటే అసలు గుర్తింపే ఉండదు. ఇది మనకు తెలిసిన నిజం. ఇదిలా ఉంచితే, ఆఖరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కోసం అప్లై చేసినా ఛీత్కారాలూ తప్పవు. ఈ తరహా అవమానం హర్మన్ ప్రీత్ కౌర్ కు గతంలో ఎదురైందట. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఊచకోత కోసి ఇప్పుడు స్టార్‌గా మారిపోయిన హర్మన్.. గతంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుని తీవ్ర అవమానికి గురైందట.  స్పోర్ట్స్ కోటాలో జాబ్ కోసం ఎన్నోసార్లు ఆమె పెట్టుకున్న దరఖాస్తులు బుడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోయాయట.

దీనిపై హర్మన్ ప్రీత్ కోచ్ యద్విందర్ సింగ్ మాట్లాడుతూ.. 'గతంలో డీజీపీ పరమిందర్ సింగ్ గిల్‌ను కలిసి హర్మన్‌ను మోగా డీఎస్పీగా నియమించాలని విజ్ఞప్తి చేయగా.. ఆమె ఏమైనా హర్భజన్ సింగ్ అనుకున్నావా ఏంటి?. ఓ మహిళా క్రికెటర్ మాత్రమేనని ఆయన బదులివ్వడం నాకింకా గుర్తుంది. ఇన్‌స్పెక్టర్‌గానైనా అవకాశమివ్వాలని కోరినా ఏ మాత్రం పట్టించుకోలేదు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన హర్మన్ చిన్న వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకుంది. అందుకోసం ఎంతగానో శ్రమించింది. అయినా ఆమెకు ఉద్యోగం దొరకలేదు. మొదట పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులను హర్మన్‌ప్రీత్‌కు ఏదైనా ఓ జాబ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. కానీ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎలాంటి స్పందన లేదని' యద్విందర్ సింగ్ వివరించారు.

'ప్రకాశ్ సింగ్ బాదల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను పలుమార్లు కలిసి హర్మన్‌ కష్టాలను వివరించినా మాకు నిరాశే ఎదురైంది. అందుకు అందరు చెప్పిన కారణం ఒకటే.. హర్మన్‌ప్రీత్ మహిళా ప్లేయర్ కావడం వల్లే జాబ్ కష్టమని చెప్పడం బాధకలిగించింది. చివరికి మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ రికమండేషన్‌తో అతికష్టమ్మీద హర్మన్‌కు రైల్వేలో జాబ్ దొరికిందన్నారు. దాంతో ఆమె కుటుంబానికి ఆర్థికంగా కాస్త ఊరట లభించిందని కోచ్ యద్విందర్ చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఆమె ఎదుర్కొన్న ఛీత్కారాలే హర్మన్‌లో కసిని పెంచి మానసికంగా దృఢంగా చేశాయని' అభిప్రాయపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement