ఓపెనర్ దొరికాడా? | Sakshi
Sakshi News home page

ఓపెనర్ దొరికాడా?

Published Sun, Nov 13 2016 1:13 PM

ఓపెనర్ దొరికాడా?

రాజ్కోట్:ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టుకు సరైన ఓపెనర్ కావాలి. దాదాపు నాలుగేళ్లుగా ఇంగ్లండ్ నిరీక్షణ ఇది. ఆండ్రూ స్ట్రాస్ వీడ్కోలు తరువాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సరైన ఓపెనింగ్ భాగస్వామ్యం లేక తంటాలు పడుతుంది. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ తో ఎంతో మంది జత కట్టినా వారు అంతగా విజయవంతం కాలేదు. తాజాగా దానికి పుల్ స్టాప్ పడినట్లే కనబడుతోంది. ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘ అన్వేషణకు దాదాపు ముగింపు దొరికినట్లుగానే ఉంది. భారత్ తో జరుగుతున్న రాజ్ కోట్ టెస్టు ద్వారా ఇంగ్లండ్ జట్టులో అరంగేట్రం చేసిన హసీబ్ హమీద్.. అలెస్టర్ కుక్ సరైన జోడి అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

దీనిపై ఇంకా స్పష్టత లేకపోయినా, హమీద్ ఆడిన ఇన్నింగ్స్ తో ఒక అంచనాకు వచ్చారు. తొలి ఇన్నింగ్స్ లో 82 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేసిన హమీద్.. రెండో ఇన్నింగ్స్ లో మరింత ఆకట్టుకున్నాడు.  177 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 82 పరుగులు చేశాడు. తన అరంగేట్రం మ్యాచ్లోనే రాణించిన హమీద్.. ఇంగ్లండ్ భవిష్య ఆశాకిరణంగా పేర్కొంటున్నారు. అలెస్టర్ కుక్ కు 10వ భాగస్వామిగా తెరపైకి వచ్చిన ఈ 19 ఏళ్ల హమీద్ను ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్ కాట్ తో పోలుస్తున్నారు. అతని బ్యాటింగ్ శైలి బాయ్ కాట్ ను పోలి ఉండటంతో హమీద్ ను బేబీ బాయ్ కాట్ గా పిలుచుకుంటున్నారు.

సచిన్ స్ఫూర్తితోనే..

భారత్ తో  బుధవారం ఆరంభమైన తొలి టెస్టు ద్వారా హసీబ్ హమిద్ అంతర్జాతీయ కెరీర్ ను ఆరంభించాడు. అయితే భారత్ మూలాలున్న ఈ క్రికెటర్ కు మాస్టర్ బ్లాస్టర్ సచినే స్ఫూర్తి అట. 2004లో ముంబైకు వచ్చినప్పుడు ఎంఐజీ క్లబ్లో సచిన్ను తొలిసారి చూశాడట.

అప్పుడే సచిన్ గురించి అడిగి తెలుసుకున్న హమిద్.. తాను కూడా ఏదొక రోజు ఇంగ్లండ్ జట్టుకు ఆడాలని భావించినట్లు అతని తండ్రి ఇస్మాయిల్ హమీద్ తెలిపాడు. ఆ సమయంలో సచిన్ గురించి అడగ్గా, అతనొక ప్రపంచం గర్వించే ఆటగాడని చెప్పినట్లు తెలిపాడు. ఈ రోజు కుమారుడు ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్గా వెళుతున్నప్పుడు తాను ఒకింత ఉద్వేగానికి లోనైనట్లు హసిబ్ తండ్రి పేర్కొన్నాడు. క్రీజ్లోకి వెళ్లి కుమారుడు కుదురుకున్నాక కానీ తన మనసులో ఆందోళన తగ్గలేదన్నాడు.

అయితే హమిద్  కుటుంబం ఏనాడో భారత్ నుంచి ఇంగ్లండ్ కు వెళ్లిపోయింది. గుజరాత్ నుంచి ఇంగ్లండ్కు వలస వెళ్లి అక్కడ పౌరసత్వాన్ని పొందింది.  అయితే కుమారున్ని క్రికెటర్ గా చూడాలని తండ్రికి  కోరిక ఉండటంతో అతన్ని అదే దిశలో నడిపించాడు. ఈ క్రమంలోనే అక్కడ లీగ్ల్లో అనేక మ్యాచ్లు ఆడిన హమీద్.. ఈ సీజన్ లో లాంక్ షైర్ తరపున ఆడి తన సత్తా చాటుకున్నాడు. 16 మ్యాచ్ల్లో 49.91 సగటుతో 1,198 పరుగులు చేశాడు.  ప్రత్యేకంగా యార్క్షైర్పై అతను సాధించిన పలు సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. ఇదే  హమిద్ అత్యంత చిన్నవయసులో ఇంగ్లండ్ తరపున ఓపెనర్గా అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మరొకవైపు ఇంగ్లండ్ తరపున పిన్న వయసులో అంతర్జాతీయ కెరీర్ను ఆరంభించిన రెండో క్రికెటర్ హమీద్.

Advertisement
Advertisement