Sakshi News home page

హీనా సిద్ధూకు స్వర్ణం

Published Tue, Mar 11 2014 1:18 AM

హీనా సిద్ధూకు స్వర్ణం

 కువైట్ సిటీ: వరుసగా రెండో రోజు ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల గురి అదిరింది. సోమవారం జరిగిన రెండు ఈవెంట్స్‌లో భారత్‌కు మొత్తం నాలుగు పతకాలు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం ఉన్నాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో హీనా సిద్ధూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

క్వాలిఫికేషన్ రౌండ్‌లో 400 పాయింట్లకు 386 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానం పొందిన హీనా... ఫైనల్లో 200.3 పాయింట్లతో విజేతగా నిలిచింది. వూ చియా యింగ్ (చైనీస్ తైపీ-198.3 పాయింట్లు) రజతం... అల్ బాలూషీ వధా (ఒమన్-177.3 పాయింట్లు) కాంస్యం సాధించారు. హీనా సిద్ధూ, శ్వేతా చౌదరీ, హర్వీన్‌లతో కూడిన భారత బృందం 1138 పాయింట్లతో టీమ్ విభాగంలో రజతం నెగ్గింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో చెయిన్ సింగ్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 619.6 పాయింట్లు స్కోరు చేసిన చెయిన్ సింగ్... ఫైనల్లో 206 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు.

టీమ్ విభాగంలో చెయిన్ సింగ్, రవి కుమార్, రఘునాథ్‌లతో కూడిన భారత జట్టుకు కాంస్యం లభించింది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు చేరాయి.
 
 

Advertisement
Advertisement