ఆటగాళ్లకు ఇదేం భోజనం!  | Sakshi
Sakshi News home page

ఆటగాళ్లకు ఇదేం భోజనం! 

Published Tue, Jun 12 2018 12:50 AM

Hockey teams demand better quality food in SAI - Sakshi

న్యూఢిల్లీ: బెంగళూరులోని ‘సాయ్‌’ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భోజన వసతి అత్యంత అధ్వాన్నంగా ఉందని భారత హాకీ చీఫ్‌ కోచ్‌ హరేంద్ర సింగ్‌ హాకీ ఇండియా (హెచ్‌ఐ)కి ఫిర్యాదు చేశారు. చాంపియన్స్‌ ట్రోఫీ కోసం హాకీ జట్టు ప్రస్తుతం బెంగళూరులో శిక్షణ తీసుకుంటుంది. కానీ అక్కడి వంటలు రుచిగా లేవని, కలుషిత వాతావరణంలో ఇవి తయారవుతున్నాయని, ఆటగాళ్లకు ఇస్తున్న ఆహారంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని కోచ్‌ హెచ్‌ఐకి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. ‘హాకీ జట్టు ప్రస్తుతం చాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం ఆసియా క్రీడలు, ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న కీలక తరుణంలో ఎలాంటి పోషక విలువల్లేని ఆహారం వండుతున్నారు, శుచి–శుభ్రత లేని వాతావరణంలో ఈ వంటలు తయారవుతున్నాయి.

నాణ్యత, శక్తి–శుభ్రత లేని ఆహారం ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని కోచ్‌  లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఇక్కడ శిక్షణ పొందుతున్న 48 మంది అథ్లెట్ల రక్త నమూనాలను పరీక్ష చేయగా శక్తిహీనత కనబడిందని చెప్పారు. కామన్వెల్త్‌ గేమ్స్‌కు ముందు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ ఇక్కడికి విచ్చేసి నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించినప్పటికీ ఎలాంటి మార్పు లేదన్నారు.   

Advertisement
Advertisement