ఒలింపిక్ చాంప్ జర్మనీని నిలువరించిన భారత్ | Sakshi
Sakshi News home page

ఒలింపిక్ చాంప్ జర్మనీని నిలువరించిన భారత్

Published Tue, Jan 14 2014 12:52 AM

ఒలింపిక్ చాంప్ జర్మనీని నిలువరించిన భారత్

 న్యూఢిల్లీ: వరల్డ్ హాకీ లీగ్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలతో కుదేలైనా... ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ జర్మనీపై భారత హాకీ జట్టు స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ప్రదర్శించింది. సోమవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని దాదాపు ఓడించినంత పనిచేసింది.
 
 అయితే చివరి నిమిషాల్లో ప్రత్యర్థికి గోల్స్ సమర్పించుకునే అలవాటున్న భారత హాకీ జట్టు మరోసారి అదే ఆటతీరును ప్రదర్శించింది. అప్పటిదాకా 3-2తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న సర్దార్ సేన మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా గోల్ సమర్పించుకుంది. దీంతో మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ సమష్టిగా కదం తొక్కుతూ 19వ నిమిషంలోనే తొలి గోల్ సాధించింది. సర్కిల్ ఆవల నుంచి రఘునాథ్ చేసిన గోల్‌తో జట్టుకు 1-0 ఆధిక్యం వచ్చింది. అయితే 24వ నిమిషంలోనే జర్మనీ ఆటగాడు మార్టిన్ హానర్ పెనాల్టీ కార్నర్ ద్వారా చేసిన గోల్‌తో స్కోరు సమమైంది.
 
  మరో ఎనిమిది నిమిషాల్లోనే తమకు లభించిన రెండో పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ గోల్‌గా మలచడంతో జట్టు 2-1 ఆధిక్యం సాధించింది. 41వ నిమిషంలో భారత్ సెల్ఫ్ గోల్‌తో స్కోరు 2-2తో సమమైంది. ఆతిథ్య జట్టు 52వ నిమిషంలో ధరమ్‌వీర్ సింగ్ ద్వారా మరో గోల్ సాధించింది. 68వ నిమిషంలో స్టాల్‌కోస్కి గోల్ చేసి భారత అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇక మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క పాయింట్ సాధించిన భారత్ పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో బుధవారం జరిగే క్వార్టర్స్‌లోగ్రూప్ ‘బి’లో టాపర్‌గా నిలిచిన ఆసీస్‌తో ఆడుతుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement