లెక్క చూసుకుని కొట్టారు.. | Sakshi
Sakshi News home page

లెక్క చూసుకుని కొట్టారు..

Published Mon, Mar 16 2015 1:04 AM

లెక్క చూసుకుని కొట్టారు..

చివరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈపై వెస్టిండీస్ విజయం
 
నేపియర్: ఓ వైపు తుఫాన్ హెచ్చరిక.. ఎక్కడ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోతుందేమోననే ఆందోళన.. మరోవైపు క్వార్టర్స్‌లో బెర్తు దక్కించుకోవాలంటే రన్‌రేట్‌తో పరుగులు తీయాలనే ఆరాటం.. ఈనేపథ్యంలో వెస్టిండీస్ అన్ని అడ్డంకులను అధిగమించింది. ప్రత్యర్థి విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని లెక్క చూసుకుని మరీ బాదింది. ఎలాంటి సమీకరణాలు లేకుండా క్వార్టర్స్‌కు ప్రవేశించాలంటే విండీస్ ఈ లక్ష్యాన్ని 36.2 ఓవర్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. అలాగైతేనే పాకిస్తాన్, ఐర్లాండ్ జట్ల ఫలితంతో సంబంధం లేకుండా (టై అయితే తప్ప) దర్జాగా నాకౌట్‌లో చోటు దక్కించుకుంటుంది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (40 బంతుల్లో 55; 9 ఫోర్లు; 2 సిక్సర్లు), జొనాథన్ కార్టర్ (58 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో జట్టు నాలుగు వికెట్లకు 30.3 ఓవర్లలోనే 176 పరుగులు చేసి సంబరాల్లో మునిగింది.
 
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 47.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ (4/27), జెరోమ్ టేలర్ (3/36) వణికించడంతో ఆ జట్టు 46 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నాసిర్ అజీజ్ (86 బంతుల్లో 60 పరుగులు; 8 ఫోర్లు), అమ్జాద్ జావేద్ (99 బంతుల్లో 56; 7 ఫోర్లు; 1 సిక్స్) అద్భుతంగా పోరాడారు.

ఏడో వికెట్‌కు వీరు 107 పరుగులు జత చేశారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రస్సెల్ విడదీశాడు. మరోవైపు ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ సంఖ్య పరుగులకే పరిమితమయ్యారు. రస్సెల్‌కు రెండు వికెట్లు పడ్డాయి. వెస్టిండీస్ వేగంగా ఆడాల్సిన స్థితిలో డ్వేన్ స్మిత్ (9 బంతుల్లో 15; 1 ఫోర్; 1 సిక్స్), మార్లన్ శామ్యూల్స్ (18 బంతుల్లో 9; 1 ఫోర్) త్వరగానే అవుటయ్యారు.  

క్రిస్ గేల్ గాయం కారణంగా... టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన చార్లెస్ మాత్రం దూకుడును కనబరిచాడు. చక్కటి కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్న తను 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తనకు జొనాథన్ కార్టర్ అండ లభించడంతో స్కోరు వేగంగా పెరిగింది. మూడో వికెట్‌కు వీరు 56 పరుగులు జోడించారు.

చార్లెస్ అవుటయ్యాక దినేశ్ రామ్‌దిన్ (50 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు) సహాయంతో కార్టర్ జట్టును తాము అనుకున్న రీతిలో ఆడి గెలిపించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించారు. గురుగే, జావేద్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.  హోల్డర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
 
స్కోరు వివరాలు
యూఏఈ ఇన్నింగ్స్: అలీ ఎల్బీడబ్ల్యు (బి) హోల్టర్ 5; బెరెంగర్ (సి) రామ్‌దిన్ (బి) హోల్డర్ 7; చంద్రన్ (సి) స్మిత్ (బి) హోల్డర్ 0; ఖుర్రమ్ (బి) టేలర్ 5; షైమన్ (బి) టేలర్ 2; పాటిల్ (బి) హోల్డర్ 6; జావేద్ (బి) రస్సెల్ 56; అజీజ్ (సి) హోల్డర్ (బి) శామ్యూల్స్ 60; నవీద్ (బి) రస్సెల్ 14; తౌఖిర్ (బి) టేలర్ 2; గురుగే నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (47.4 ఓవర్లలో ఆలౌట్) 175.
 
వికెట్ల పతనం: 1-13; 2-16; 3-17; 4-21; 5-26; 6-46; 7-153; 8-167; 9-167; 10-175.
 బౌలింగ్: టేలర్ 8.4-0-36-3; హోల్డర్ 10-1-27-4; రోచ్ 8-0-54-0; రస్సెల్ 8-3-20-2; శామ్యూల్స్ 10-4-25-1; స్యామీ 1-0-4-0; స్మిత్ 2-0-5-0.

 వెస్టిండీస్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) పాటిల్ (బి) గురుగే 15; చార్లెస్ (సి) చంద్రన్ (బి) జావేద్ 55; శామ్యూల్స్ (సి) బెరెంగర్ (బి) గురుగే 9; కార్టర్ నాటౌట్ 50; రస్సెల్ (సి అండ్ బి) జావేద్ 7; రామ్‌దిన్ నాటౌట్ 33; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (30.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 176.
 వికెట్ల పతనం: 1-33; 2-53; 3-109; 4-118.
 బౌలింగ్: అజీజ్ 6-0-47-0; నవీద్ 6-0-34-0; గురుగే 7.3-1-40-2; తౌఖిర్ 3-0-22-0; జావేద్ 8-0-29-2.

వెస్టిండీస్, యూఏఈ, క్రికెట్-ప్రపంచ కప్-2015,

 

Advertisement
Advertisement