వార్నర్‌ వీర విజృంభణ | Sakshi
Sakshi News home page

వార్నర్‌ వీర విజృంభణ

Published Tue, Jan 3 2017 11:44 PM

వార్నర్‌ వీర విజృంభణ

తొలి సెషన్‌లోనే 78 బంతుల్లో సెంచరీ
రెన్‌షా తొలి శతకం
ఆస్ట్రేలియా 365/3  


సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన మెరుపు బ్యాటింగ్‌ (95 బంతుల్లో 113; 17 ఫోర్లు)తో పాకిస్తాన్‌పై దాడి చేశాడు. పాక్‌ బౌలర్లను చితక్కొడుతూ మూడో టెస్టులో సూపర్‌ సెంచరీ సాధించిన అతను... టెస్టు మ్యాచ్‌ తొలి రోజు లంచ్‌ విరామానికి ముందే శతకం పూర్తి చేసుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. గతంలో ట్రంపర్, మకార్ట్‌నీ, బ్రాడ్‌మన్, మజీద్‌ ఖాన్‌ మాత్రమే మొదటి సెషన్‌లో సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత వార్నర్‌ దానిని చేసి చూపించాడు. కొత్త సంవత్సరంలో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లో 78 బంతుల్లోనే అతని సెంచరీ పూర్తయింది. వార్నర్‌ కెరీర్‌లో ఇది 18వ సెంచరీ కావడం విశేషం. మెల్‌బోర్న్‌ టెస్టులోనూ సెంచరీ చేసిన వార్నర్‌కు సిరీస్‌లో ఇది రెండో శతకం. వార్నర్‌ దూకుడుకు తోడుగా మరో ఎండ్‌లో మాట్‌ రెన్‌షా (275 బంతుల్లో 167 బ్యాటింగ్‌; 18 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్‌తో కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా మొదటి రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. ఖాజా (13), స్మిత్‌ (24) విఫలం కాగా, రెన్‌షాతో పాటు ప్రస్తుతం హ్యండ్స్‌కోంబ్‌ (82 బంతుల్లో 40 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 121 పరుగులు జోడించారు. వహాబ్‌కు 2 వికెట్లు దక్కాయి. (ఇక్కడ చదవండి: 40 ఏళ్లలో తొలిసారిగా ఓ క్రికెటర్..!)

తిరుగులేని బ్యాటింగ్‌...
తొలి ఓవర్‌ మూడో బంతికి బౌండరీతో మొదలైన వార్నర్‌ విధ్వంసం 32.3 ఓవర్ల పాటు సాగింది. ఇమ్రాన్, ఆమిర్‌ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన అతను, ఆ తర్వాత ఇమ్రాన్‌ మరో ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. 42 బంతుల్లో హాఫ్‌ సెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా అతను ఎక్కడా తగ్గలేదు. వహాబ్‌ వేసిన 27వ ఓవర్‌ రెండో బంతిని బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఆడి మూడు పరుగులు తీయడంతో వార్నర్‌ సెంచరీ పూర్తయింది. గాల్లోకి ఎగిరి తనదైన శైలిలో అతను సంబరాలు చేసుకున్నాడు. ఈ సమయంలో మరో ఎండ్‌లో ఉన్న రెన్‌షా స్కోరు 21 పరుగులే అంటే వార్నర్‌ బీభత్సం ఎలా సాగిందో అర్థమవుతుంది. లంచ్‌ తర్వాత కొద్దిసేపటికి వహాబ్‌ బౌలింగ్‌లోనే కీపర్‌ సర్ఫరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వార్నర్‌ నిష్క్రమించాడు. తొలి వికెట్‌కు వార్నర్, రెన్‌షా 151 పరుగులు జత చేశారు. ఆమిర్‌ బౌలింగ్‌లో తల బంతికి తగలడంతో మైదానంలోనే కొద్దిసేపు చికిత్స చేయించుకున్న రెన్‌షా, ఆ తర్వాత 201 బంతుల్లో కెరీర్‌లో తొలి శతకం అందుకున్నాడు. సిడ్నీ మైదానంలో ఇద్దరు ఆస్ట్రేలియా ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేయడం 2002 తర్వాత ఇదే తొలిసారి.

2006లో గ్రాస్‌ ఐలెట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో భారత ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ లంచ్‌ సమయానికి (25 ఓవర్లు) 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Advertisement
Advertisement