Sakshi News home page

టిఫిన్ తిని ఎన్నాళ్లయింది!!

Published Tue, Aug 23 2016 9:43 AM

టిఫిన్ తిని ఎన్నాళ్లయింది!! - Sakshi

ఒలింపిక్ పతకాలు సాధించడం అంటే చిన్న విషయం కాదు. దాని వెనుక కఠోర శ్రమ ఉంటుంది, అపారమైన త్యాగాలుంటాయి.. చివరకు తమకు ఎంతో ఇష్టమైన తిండి కూడా తినలేక కడుపు మాడ్చుకోవాల్సి ఉంటుంది. పతకం సాధించి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ తన చేత్తో వండిపెట్టిన కమ్మటి టిఫిన్ తింటుంటే 'ఎన్నాళ్లయింది' అనుకోవడం సహజం. ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో కాంస్యపతకం సాధించిన సాక్షి మాలిక్ సరిగ్గా ఇలాగే అనుకుంది. 12 ఏళ్ల కష్టం, ఓర్పు, త్యాగాల ఫలితంగా ఆమెకు పతకం వచ్చింది. రియోలో సాధించిన విజయం తాలూకు సంబరాలు ముగిసిన తర్వాత.. ఇప్పుడు ఆమె తనకు ఇష్టమైన పని చేస్తోంది. అవును.. మంచి టిఫిన్ తింటోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఫొటోతో సహా ట్వీట్ చేసింది. ప్లేటు నిండా టిఫిన్ పెట్టుకుని, కావల్సినవి నంజుకుని తింటూ ఆస్వాదించి ఎన్నాళ్లయిందో అంటూ ఆమె ఆనందంగా చెప్పింది. టిఫిన్ తింటున్న ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది.

సాక్షి మాలిక్ మాత్రమే కాదు.. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుది కూడా ఇదే పరిస్థితి. హైదరాబాద్‌లో సంబరాలు ముగిసిన తర్వాత ఆమె నేరుగా ఇంటికి వెళ్లి అమ్మ చేసిపెట్టిన బిర్యానీ, మైసూర్పాక్ తింది. దాదాపు మూడు నెలలుగా ఆమెకు దూరం చేసిన ఫోన్ తిరిగిస్తానని కోచ్ గోపీచంద్ చెప్పారు. దాంతోపాటు ఇన్నాళ్ల నుంచి ఆమెకు ఎంతో ఇష్టమైన తీపి పెరుగు, ఐస్‌క్రీం కూడా తిననివ్వలేదు.

ఇక జిమ్నాస్టిక్స్‌లో నాలుగోస్థానం వచ్చినా, తన అద్భుతమైన ప్రదర్శనతో 125 కోట్ల మంది భారతీయుల హృదయాలను ఆకట్టుకున్న దీపా కర్మాకర్ కూడా పోటీలు ముగిసిన తర్వాత కావల్సినంత ఐస్‌క్రీమ్, స్ట్రాబెర్రీలు తినేసింది. ఫైనల్ ముగిసిన రెండు రోజుల తర్వాత తాను ఐస్‌క్రీంతో పాటు స్ట్రాబెర్రీ స్మూతీలు తిన్నానని, గత మూడు నెలల్లో తాను ఇలా తినడం ఇదే మొదటిసారని ఆమె చెప్పింది. కాబట్టి.. సాధించిన విజయాలు మాత్రమే కాదు.. దాని వెనక ఉన్న వాళ్ల కష్టం కూడా చూడాలి మరి!

 

Advertisement

తప్పక చదవండి

Advertisement