తొలి గెలుపుపై హైదరాబాద్ దృషి | Sakshi
Sakshi News home page

తొలి గెలుపుపై హైదరాబాద్ దృషి

Published Thu, Nov 14 2013 12:10 AM

HYderabad team eyes on to win game

సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీని ఎప్పటిలాగే నిరాశాజనకంగా ప్రారంభించిన హైదరాబాద్ టీమ్ మరో పోరుకు సిద్ధమైంది.  ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గురువారం నుంచి జరిగే గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో మహారాష్ట్రను హైదరాబాద్ ఎదుర్కొంటుంది. ఆడిన రెండు మ్యాచ్‌లను డ్రాగా ముగించిన హైదరాబాద్ 4 పాయింట్లతో ఈ గ్రూప్‌లో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు మహారాష్ట్ర ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఘన విజయం సాధించి ఉత్సాహంలో ఉంది.
 
 కెప్టెన్ విఫలం...
 గ్రూప్ ‘సి’లో తొలి రెండు స్థానాల్లో నిలిస్తేనే వచ్చే ఏడాది ప్రమోషన్  లభిస్తుంది. సొంతగడ్డపై ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం అందుకోలేకపోయిన హైదరాబాద్, ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాల్సి ఉంది. గత రెండు సీజన్లలో అద్భుతంగా ఆడి చాలెంజర్, దులీప్ ట్రోఫీల్లో కూడా పాల్గొన్న కెప్టెన్ అక్షత్ రెడ్డి విఫలం కావడం హైదరాబాద్‌ను కలవరపరుస్తోంది. అయితే మరో ఓపెనర్‌గా తిరుమలశెట్టి సుమన్ చెలరేగడం జట్టుకు అనుకూలాంశం. మిడిలార్డర్‌లో విహారి, సందీప్ కూడా నిలకడ ప్రదర్శిస్తున్నారు. బౌలింగ్‌లో రవికిరణ్ చక్కటి పేస్‌తో ఆకట్టుకుంటుండగా, ఆశిష్ రెడ్డి కూడా స్వింగ్‌తో వికెట్లు తీశాడు. అన్వర్ ఖాన్‌కు కూడా రంజీల్లో ఆడిన అనుభవం ఉన్నా...ఖాదర్‌కే తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 
 జోల్‌పై దృష్టి...
 మరోవైపు మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్‌లో త్రిపురను చిత్తుగా ఓడించి ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. గత ఏడాది కాలంగా అద్భుత ఫామ్‌తో చెలరేగుతున్న భారత అండర్-19 కెప్టెన్ విజయ్ జోల్ మహారాష్ట్ర తరఫున సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. తన తొలి రంజీ మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ చేసిన జోల్‌పైనే ఇప్పుడు జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధార పడింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement