అతని కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యా: మయాంక్‌ | Sakshi
Sakshi News home page

అతని కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యా: మయాంక్‌

Published Thu, Jan 10 2019 11:54 AM

I analyzed what Lyon is trying to do, Mayank Agarwal - Sakshi

సిడ్నీ: ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్‌ ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి (76,42) 118 పరుగులు చేసి విదేశీ గడ్డపై అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత్‌ ఆటగాడిగా నిలిచిన మాయాంక్‌.. నాల్గో టెస్టులోనూ ఆకట్టుకున్నాడు. ఆసీస్‌తో చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మాయంక్‌ అగర్వాల్‌(77; 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఆరంభాన్ని అందించాడు. ఫలితంగా తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్థ శతకాలు సాధించిన మూడో భారత ఓపెనర్‌గా నిలిచాడు. ఓపెనర్‌ పృథ్వీ షా గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరం కావడంతో మయాంక్‌ను అదృష్టం వరించింది.

అయితే ఆసీస్‌ స్పిన్నర్‌ లయన్‌ కోసం ప్రత్యేకంగా సిద్ధమైన విషయాన్ని మయాంక్‌ తాజాగా స్పష్టం చేశాడు. తొలి రెండు టెస్టుల్లో 16 వికెట్లు సాధించిన మంచి ఊపు మీద ఉన్న లయన్‌ అడ్డుకోవడంపైనే ఎక్కువ దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు. ‘ మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో కోచ్‌ రవిశాస్త్రి సర్‌ నా వద్దకు వచ్చారు. నా అరంగేట్రంపై ఒక స్పష్టత ఇచ్చారు శాస్త్రి సర్‌. ఆ సమయంలో నేను కాస్త ఆందోళనకు లోనయ్యా.  ఆ సీన్‌ను వాస్తవంలో తలుచుకుంటే ఏదో తెలియని ఫీలింగ్‌.. ఒక వైపు ఆనందం.. మరొకవైపు కాస్త భయం.

ఆ సమయంలో నేను లయన్‌ కోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకోవాలనుకున్నా. బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సర్‌, కేఎల్‌ రాహుల్‌లు లయన్‌ బౌలింగ్‌ను ఎలా ఆడాలనే దానిపై చర్చిస్తున్నారు. అందులో నేను భాగస్వామ్యం అయ్యా. మేమంతా లయన్‌ బంతిని సంధించే విధానంపై సుదీర్ఘంగా చర్చించా. ప్రాక్టీస్‌ సెషన్‌లో అదే పనిగా లయన్‌ను ఎదుర్కోవడంపై చెక్‌ చేసుకున్నా. అదే ప్రణాళికను మ్యాచ్‌లో కూడా అవలంభించి సక్సెస్‌ అయ్యా. ఒక స్టార్‌ స్పిన్నర్‌ను కచ్చితమైన ఎదుర్కొని విజయవంతం కావడం చాలా సంతోషం అనిపించింది’ అని మయాంక్‌ అగర్వాల్‌ తెలిపాడు.

Advertisement
Advertisement