Sakshi News home page

నేనెప్పుడూ రూ. 16 కోట్లు అడగలేదు: యువీ

Published Sat, Apr 18 2015 1:42 PM

నేనెప్పుడూ రూ. 16 కోట్లు అడగలేదు: యువీ

ఐపీఎల్లో తన ఫాం గురించి అనుమానాలు వస్తున్నాయనో.. లేదా రికార్డు స్థాయిలో తనకు రూ. 16 కోట్లు ఇచ్చారని అంతా అనుకుంటున్నారని భావించాడో గానీ యువరాజ్ సింగ్ ఆ అంశంపై నోరు విప్పాడు. తానెప్పుడూ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు యాజమాన్యాన్ని రూ. 16 కోట్ల ఫీజు అడగలేదని చెప్పాడు. ప్రస్తుతం టోర్నమెంటులోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేరొందిన యువరాజ్ రూ. 16 కోట్లు తీసుకోవడంపై పలు రకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. అయితే అది తన చేతుల్లో లేదని, తాను కూడా ఇతర ఆటగాళ్లలాగే వేలంలో ఉన్నానని యువీ చెప్పాడు. తనకు అంత మొత్తం ఇచ్చినా ఇవ్వకున్నా ఐపీఎల్లో మాత్రం తప్పకుండా ఆడేవాడినని తెలిపాడు.

ఇక గ్యారీ కిర్స్టెన్తో తన సంబంధాలు ఎప్పటిలాగే బాగున్నాయని యువరాజ్ చెప్పాడు. గ్యారీతో తనకు మంచి అండర్స్టాండింగ్ ఉందని అన్నాడు. తనను ఎప్పుడూ బాగా ప్రోత్సహిస్తాడని, జట్టును గెలిపించేలా ఉత్సాహం నింపుతాడని.. దాంతో తనకు బోలెడంత ఆత్మవిశ్వాసం వస్తుందని వివరించాడు.  టీమిండియా కోచ్గా ఉన్నప్పుడు గ్యారీ కేవలం 15 మందిని చూసుకుంటే సరిపోయేది గానీ ఇప్పుడు ఐపీఎల్లో 25 మంది ఆటగాళ్లను చూసుకోవాల్సి వస్తోందని అన్నాడు. గత మ్యాచ్లో తన హాఫ్ సెంచరీ పట్ల యువీ ఆనందం వ్యక్తం చేశాడు. టి-20 మ్యాచ్లలో నిలదొక్కుకునేందుకు తగినంత సమయం దొరకదని, గత మ్యాచ్లో మాత్రం మంచి అవకాశం దొరికిందని అన్నాడు. తనకు మంచి పరుగులు వచ్చాయన్నదాని కంటే టీమ్ నెగ్గినందుకు సంతోషంగా ఉందని యువీ చెప్పాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement