'వారి ప్రేమను గెలుస్తా' | Sakshi
Sakshi News home page

'వారి ప్రేమను గెలుస్తా'

Published Sat, Jan 2 2016 5:32 PM

'వారి ప్రేమను గెలుస్తా'

లాహోర్:స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న పాకిస్తాన్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ తన పునరాగమనంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. తనపై వస్తున్న విమర్శలకు త్వరలో న్యూజిలాండ్ లో జరిగే సిరీ్స్ లో వికెట్లతోనే సమాధానమిస్తానని స్పష్టం చేశాడు.  24 ఏళ్ల ఆమిర్ పునరాగమనంపై అన్ని వైపులనుంచి విమర్శలు వచ్చినా... అతనికి గట్టిగా మద్దతు పలికిన పాక్ బోర్డు మాత్రం అతని దేశవాళీ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని జాతీయ జట్టులో స్థానం కల్పించింది.  దీనిపై తాజాగా స్పందించిన ఆమిర్.. న్యూజిలాండ్ పర్యటనలో సత్తా చాటి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెడతానన్నాడు.  ' కివీస్ పర్యటన నాకు ఎంతో కీలకం. అక్కడ వికెట్లు తీసి నన్ను విమర్శించే వారి  ప్రేమను సంపాదిస్తా. దాంతో పాటు ప్రేక్షకులు నాపై పెట్టుకున్న ఆశలను కూడా నెరవేరుస్తా. నా శాయశక్తులా శ్రమించి పాక్ జట్టు విజయానికి కృషి చేస్తా. జట్టులోని మిగతా సభ్యులు సహకరిస్తారని ఆశిస్తున్నా. వారి నుంచి ఎటువంటి ప్రతికూలత వస్తుందని అనుకోవడం లేదు' అని ఆమిర్ తెలిపాడు.
 

ఇటీవల పాక్ జట్టు సన్నాహక శిబిరంలో ఆమిర్ చేరడంపై వన్డే కెప్టెన్ అజహర్ అలీ, హఫీజ్ లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. చివరకు రాజీనామా చేసేందుకు కూడా అలీ సిద్దమయ్యాడు.  అయితే పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ జోక్యంతో అజహర్ అలీ వెనక్కితగ్గాడు. ఈ క్రమంలోనే వారిద్దర్ని ఆమిర్ క్షమించమని వేడుకున్నాడు. 2010 వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించడంతో పాటు ఐదేళ్లు జట్టుకు దూరంగా ఉన్న ఆమిర్.. న్యూజిలాండ్ పర్యటన ద్వారా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement