నేను మ్యాచ్‌కు వెళతా.. మరి మీరు: కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

నేను మ్యాచ్‌కు వెళతా.. మరి మీరు: కేటీఆర్‌

Published Sun, Jun 3 2018 2:24 PM

 Iam going to a football game soon, What about you guys?, KTR - Sakshi

హైదరాబాద్‌: ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ స్టేడియానికి వచ్చి మేం ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడండి’ అని భారత కెప్టెన్ సునీల్ చెత్రి ఆవేదనతో పిలుపుచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చెత్రీ అభ్యర్థన పట్ల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మంత్రి.. ‘నేను త్వరలోనే ఫుట్‌బాల్ గేమ్ చూసేందుకు వెళ్తున్నాను. మీ సంగతేంటి? అంటూ తన ఫాలోవర్లను ప్రశ్నించారు. చెత్రీ వీడియోను రీట్వీట్ చేయండి, అతడి సందేశాన్ని అందరికీ చేరవేయండి’ అని కేటీఆర్ కోరారు. మరొకవైపు భారత ఫుట్‌బాల్ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వెళ్లి చూడాలని కోహ్లి తన అభిమానులను ట్విట్టర్ ద్వారా కోరాడు. ఫుట్‌బాల్, క్రీడలను ఆదరించండని కోహ్లి పిలుపునిచ్చాడు. దేశంలో క్రీడా సంస్కృతి పెంపొందించాలని విరాట్ సూచించాడు.

‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్‌ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండి. యూరోపియన్‌ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సపోర్ట్ తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని అనిపించొచ్చు. మేం కాదనట్లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం’ అని చెత్రీ అభిమానులను అభ్యర్థించాడు.

ప్రస్తుతం భారత ఫుట్‌బాల్ జట్టు 97వ స్థానంలో ఉంది. శుక్రవారం నాలుగు దేశాల టోర్నీ ప్రారంభం కాగా.. మొదటి మ్యాచ్‌లో 5-0 తేడాతో చైనీస్‌ తైపీపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌కి ఆదరణ కరువైంది. కేవలం 2569 మంది ప్రేక్షకులే ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. దీంతో ముంబైలోని ఫుట్‌బాల్‌ ఎరీనా స్టేడియం బోసిగా కనిపించింది. చెత్రీ హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టును గెలిపించినప్పటికీ ప్రేక్షులెవరూ లేకపోవడం అతన్ని కలచి వేసింది. దాంతో సోషల్‌ మీడియా ద్వారా తన ఆవేదనను పంచుకున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement