పునరాగమనంపై ఆలోచన లేదు: రాయుడు | Sakshi
Sakshi News home page

పునరాగమనంపై ఆలోచన లేదు: రాయుడు

Published Sat, Mar 17 2018 10:42 AM

Iam not looking or thinking about national comeback, Rayudu - Sakshi

చెన్నై: భారత జాతీయ జట్టులో పునరాగమనం చేసే విషయం గురించి ప్రస్తుతం ఎలాంటి ఆలోచన చేయడంలేదని హైదరాబాద్‌ రంజీ జట్టు కెప్టెన్‌ అంబటి రాయుడు స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో గత సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రాయుడు ఈ సీజన్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) తరఫున బరిలో దిగనున్నాడు.

ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ... ‘చెన్నై తరఫున ఆడనుండటం ఆనందంగా ఉంది. ధోని కెప్టెన్సీలో సీఎస్‌కే లాంటి చాంపియన్‌తో జతకట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. జట్టు ప్రయోజనాల కోసం వంద శాతం కష్టపడటానికి నేను సిద్ధం. ప్రత్యేకంగా ఏదో ఓ స్థానంలో స్థిరపడాలనుకోవడం లేదు. సీఎస్‌కే ప్రయోజనాల కోసం దేనికైనా రెడీ. జాతీయ జట్టులో పునరాగమనం గురించి ఆలోచించడం లేదు. దేశవాళీల్లో హైదరాబాద్‌ తరఫున రాణిస్తున్నా. ప్రస్తుతం నా దృష్టంతా సీఎస్‌కేతో కలిసి ముందుకు సాగడం పైనే’ అని అన్నాడు. ముంబై, చెన్నై రెండు గోప్ప జట్లేనని... గెలవాలనే కసి ఏ జట్టు ప్రదర్శిస్తుందో ఆదే విజేతగా నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు. చెన్నై నుంచి పంజాబ్‌కు వెళ్లిన ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానాన్ని హర్భజన్‌ భర్తీ చేస్తాడనుకుంటున్నారా అంటే... ‘భజ్జీ ఎప్పటికీ మ్యాచ్‌ విన్నరే. గతేడాది కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. అతనో టాప్‌ క్లాస్‌ బౌలర్‌. అతన్ని మరొకరితో పోల్చడం సరికాదు’ అని అన్నాడు. వీరిద్దరు గతంలో ముంబై ఇండియన్స్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.  

Advertisement
Advertisement