ఐసీసీ C/oబీసీసీఐ | Sakshi
Sakshi News home page

ఐసీసీ C/oబీసీసీఐ

Published Thu, Jan 30 2014 12:51 AM

ఐసీసీ C/oబీసీసీఐ

దుబాయ్: క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం బుధవారం ముగిసింది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కలిసి ప్రతిపాదించిన కొత్త విధానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని ఐసీసీ ప్రకటించింది. అయితే వీటిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మరో నెల రోజులు సమయం పడుతుంది.
 
 
  కానీ ఐసీసీ ప్రకటనను దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ బోర్డులు ఖండించాయి. సమావేశంలో కొత్త ప్రతిపాదనలపై వాదన జరిగిందని, వాటికి పూర్తిగా ఆమోదం లభించలేదని ఈ బోర్డులు అంటున్నాయి. గది లోపల ఏం చర్చ జరిగిందనేది ప్రపంచానికి పూర్తిగా తెలియదు. కానీ ఐసీసీ అడ్రస్ ఇక నుంచి బీసీసీఐ అని మాత్రం ప్రపంచానికి స్పష్టమైంది.
 
 ఇన్నాళ్లూ ఐసీసీలో ఏ నిర్ణయం తీసుకున్నా... దాని వెనక బీసీసీఐ ఉందనేది వాస్తవం. ఇకపై బీసీసీఐ నేరుగా తమ అభిప్రాయాన్నే ఐసీసీ అభిప్రాయంగా చెప్పొచ్చు. ఇకపై క్రికెట్ పాలన కేవలం మూడు దేశాల చేతుల్లోనే ఉంటుంది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు చెందిన వ్యక్తులు మాత్రమే అత్యున్నత పదవి ‘ఐసీసీ చైర్మన్’ను అలంకరిస్తారు. ఆదాయంలోనూ అగ్రతాంబూలం భారత్‌కే.
 
 ఆటగాళ్లు ఒప్పుకోవడం లేదు
 ఈ మూడు దేశాలకు వెస్టిండీస్, న్యూజిలాండ్ బహిరంగంగా మద్దతు తెలిపాయి. జింబాబ్వే ఏ ప్రకటన చేయకపోయినా... భారత్‌తో శత్రుత్వం కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రతిపాదనల వల్ల అందరికంటే ఎక్కువగా నష్టపోతామని భావిస్తున్న దేశాలు దక్షిణాఫ్రికా, పాకిస్థాన్. ఈ రెండు దేశాల బోర్డుల పెద్దలు శ్రీలంక, బంగ్లాదేశ్ బోర్డులను కూడా తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాయి. ప్రస్తుతం ఐసీసీ వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న బంగ్లాదేశ్ వీళ్లకు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. కానీ బుధవారం సాయంత్రానికి బీసీసీఐకి మద్దతు తెలిపింది. అయితే శ్రీలంక మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.
 
 నెల రోజుల సమయం
 ఈ ప్రతిపాదనల్ని ఆయా దేశాలు తమ బోర్డు సమావేశాల్లో చర్చించుకోవడానికి నెల రోజులు సమయం ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఒకవేళ అప్పుడు ఓటింగ్ జరగాల్సి వస్తే... కొత్త ప్రతిపాదనల ఆమోదం కోసం ఎనిమిది ఓట్లు కావాలి. ఇప్పుడు ఏడు ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఈ నెల రోజుల్లో తటస్థంగా ఉన్న శ్రీలంక లాంటి బోర్డును ఒప్పించుకుంటే సరిపోతుంది. మామూలు మార్పులకు ఏడు ఓట్లు సరిపోతాయి. ఇప్పుడు ఏడు ఉన్నాయి. కానీ ఐసీసీ రాజ్యాంగ సవరణ జరగాలంటే ఎనిమిది ఓట్లు కావాలి.
 
 ‘త్రయం’ తాయిలాలు
 తమతో కలిసి వచ్చే దేశాలతో క్రికెట్ ఆడతారు. కాదంటే వాళ్లతో అసలు క్రికెట్ ఆడరు.
 ‘టెస్టు మ్యాచ్ నిధి’లో అందరికీ సమానంగా భాగం ఇస్తారు. అగ్రస్థానంలో ఉన్న జట్టుకు ఎక్కువ డబ్బు ఇవ్వాలని దక్షిణాఫ్రికా చేసిన డిమాండ్‌ను అంగీకరించరు. దీనివల్ల వెస్టిండీస్, న్యూజిలాండ్ దేశాలు సంతోషిస్తున్నాయి.
 
 ఒప్పుకోకపోతే..?
 ఐసీసీ సమావేశాలకు ముందు ఈ త్రయం పరోక్షంగా అందరికీ హెచ్చరిక జారీచేసింది. ఒకవేళ మిగిలిన దేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి కొత్త ప్రతిపాదనలు తిరస్కరిస్తే... కేవలం భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కలిసి క్రికెట్ ఆడతామనే సందేశాన్ని పంపాయి. క్రికెట్‌లో 90 శాతం ఆదాయం వచ్చే ఈ మూడు దేశాలు లేకపోతే... అసలు క్రికెట్ ఉండదు. కాబట్టి మిగిలిన వాళ్లు కాదనలేని పరిస్థితి.
 
 భారత్ 3
 కొత్త ప్రతిపాదనలు తెచ్చింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లనూ కలుపుకుంది. ఐసీసీలో అధిక ఆధిపత్యం భారత్‌దే.
 
 ఆస్ట్రేలియా 3
 భారత్ ప్రతిపాదనలను అంగీకరించేలా న్యూజిలాండ్‌ను ఒప్పించింది. తాను కూడా ఆమోదం తెలిపింది.
 
 ఇంగ్లండ్3
 భారత్, ఆస్ట్రేలియాలను కాదని ఏమీ చేయలేదు. తనకూ పెత్తనం ఉంటుందని భావించింది.
 
 వెస్టిండీస్3
 భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లేకపోతే తమ దగ్గర క్రికెట్ లేదని తెలుసు.
 కాబట్టి ఒప్పుకుంది.
 
 న్యూజిలాండ్3
 ఇప్పటికే ఆదాయం అంతంత మాత్రంగా ఉంది. ఇక ఈ మూడు దేశాలనూ కాదనలేని పరిస్థితి.
 
 జింబాబ్వే 3
 బీసీసీఐ దయ లేకపోతే తమ దేశంలో క్రికెట్‌కు మనుగడ ఉండదని భావించింది.
 
 శ్రీలంక (?)
 భారత్‌తో సంబంధాలు కావాలి. అదే సమయంలో తమ ప్రతిష్ట దెబ్బతింటుం దనే భయం. ప్రస్తుతానికి తటస్థం.
 
 దక్షిణాఫ్రికా 6
 ఎక్కువ నష్టం తమకే అని భావిస్తోంది. ఎలాగైనా ఈ ప్రతిపాదనలను ఆపాలంటూ లాబీయింగ్ చేస్తోంది.
 
 పాకిస్థాన్ 6
 భారత్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తోంది. కానీ బలం సరిపోవడం లేదు. మొదటికే మోసం వస్తుందనే భయమూ ఉంది.
 

Advertisement
Advertisement