‘ముగ్గురి’ పవర్ కు ముగింపు! | Sakshi
Sakshi News home page

‘ముగ్గురి’ పవర్ కు ముగింపు!

Published Fri, Feb 5 2016 12:50 AM

‘ముగ్గురి’ పవర్ కు ముగింపు!

ఐసీసీలో సమూల మార్పులు  చైర్మన్‌గా స్వతంత్ర వ్యక్తి
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో ఏడాది వ్యవధిలోనే సమూల మార్పులకు మరోసారి రంగం సిద్ధమైంది. 2014లో చైర్మన్‌గా పరిపాలనలో ఎన్.శ్రీనివాసన్ అమల్లోకి తెచ్చిన విధానాలు, నిబంధనలు అన్నింటినీ మార్చేయాలని ఐసీసీ భావిస్తోంది. గురువారం ఇక్కడ జరిగిన సమావేశంలో దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు దేశాలకు చెందిన బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియాలకు అపరిమిత అధికారాలు ఇస్తూ, ఐసీసీ ఆదాయంలో అగ్రభాగం ఈ మూడు దేశాలకే దక్కేలా నాడు శ్రీనివాసన్ అమల్లోకి తెచ్చిన విధానాన్ని పూర్తిగా తొలగిస్తున్నారు.

ఇకపై ఈ మూడు దేశాలకు శాశ్వత సభ్యత్వం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. పూర్తి స్థాయి సభ్య దేశాలు, అసోసియేటెడ్ దేశాల బోర్డులకు కూడా ఇకపై తగిన ప్రాధాన్యత ఉంటుంది.  చైర్మన్ హోదాలో ఉన్న శశాంక్ మనోహర్ స్వయంగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టడం విశేషం. ఐసీసీని కూడా మరింత పారదర్శకంగా మార్చేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇకపై చైర్మన్‌గా కూడా స్వతంత్ర వ్యక్తి ఎంపికవుతారు. రెండేళ్ల పదవీకాలానికి జరిగే ఈ ఎన్నికల ప్రక్రియను ఐసీసీ ఆడిట్ కమిటీ పర్యవేక్షిస్తుంది. చైర్మన్‌గా పని చేయబోయే వ్యక్తి ఏ బోర్డులోనూ అధికారిక హోదాలో ఉండరాదనేది కూడా కొత్త నిబంధన. రాబోయే జూన్‌లో ఎడిన్‌బర్గ్‌లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశంనుంచి ఇవన్నీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

రాహుల్ ద్రవిడ్‌కు చోటు
భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కొత్తగా ఏర్పాటైన ఐసీసీ అవినీతి వ్యతిరేక పర్యవేక్షణ బృందంలో సభ్యుడిగా ఎంపికయ్యారు. క్రికెట్‌లో అవినీతిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వాటి అమలు తీరును ఈ బృందం పర్యవేక్షిస్తుంది. ఇందులో క్రికెటర్‌గా ద్రవిడ్‌కు చోటు దక్కగా... ఇద్దరు న్యాయ నిపుణులు, ఐసీసీ అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement