కోర్టు కాదనుంటే... | Sakshi
Sakshi News home page

కోర్టు కాదనుంటే...

Published Tue, Mar 10 2015 12:43 AM

కోర్టు కాదనుంటే...

ఇంగ్లండ్‌పై విజయంతో బంగ్లాదేశ్‌లో సంబరాలు మిన్నంటాయి. ఇక మ్యాచ్ పోయిందనుకున్న దశలో రూబెల్ హొస్సేన్ రెండు వికెట్లు తీసి వాళ్ల దేశంలో పండగ వాతావరణం సృష్టించాడు. నిజానికి ప్రపంచకప్ ప్రారంభానికి నెల ముందు కూడా రూబెల్ ఆడతాడో లేదో అనే సందేహం ఉంది. వివరాల్లోకి వెళితే... నాన్‌జిన్ అక్తర్ హ్యాపీ అనే సినీ నటి రూబెల్‌పై గత డిసెంబరు 13న రేప్ కేసు పెట్టింది.

తనకు ఎలాంటి సంబంధం లేదని రూబెల్ దీనిని కొట్టిపారేసినా... ఈ ఏడాది జనవరి 8న రూబెల్‌ను ఢాకా పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత మూడు రోజులకు తనకు బెయిల్ రావడంతో బయటకు వచ్చాడు. కానీ దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. అప్పటికే ప్రపంచకప్ ఆడేందుకు ప్రకటించిన జట్టులో తను ఉన్నాడు. బంగ్లా బోర్డు సహాయంతో రూబెల్ మళ్లీ కోర్టును ఆశ్రయించి ప్రపంచకప్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. జనవరి 14న ఢాకా కోర్టు తనకు అనుమతి ఇచ్చింది. దీంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఒకవేళ ఆ కేసులో న్యాయమూర్తి రూబెల్ బెయిల్‌ను నిరాకరించి ఉంటే...  రూబెల్ ‘హీరో’యిజం బయటకి వచ్చేది కాదేమో.

Advertisement
Advertisement