కపిల్ ఇన్నింగ్స్ తో పోలికా?: గంభీర్ | Sakshi
Sakshi News home page

కపిల్ ఇన్నింగ్స్ తో పోలికా?: గంభీర్

Published Sat, Jul 22 2017 2:36 PM

కపిల్ ఇన్నింగ్స్ తో పోలికా?: గంభీర్

న్యూఢిల్లీ: మహిళల వన్డే వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఉన్న భారత జట్టుపై వెటరన్ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై వంటి పటిష్టమైన జట్టుపై గెలవడం అంత ఈజీ కాదని, కాకపోతే దాన్ని సుసాధ్యం చేశారంటూ భారత మహిళా క్రికెటర్లను పొగడ్తలతో ముంచెత్తాడు. ఒకవేళ రేపు(ఆదివారం) ఇంగ్లండ్ తో జరిగే అమీతుమీ పోరులో భారత్ విజేతగా నిలిస్తే మాత్రం 2011లో పురుష క్రికెట్ జట్టు సాధించిన వన్డే వరల్డ్ కప్ కంటే కూడా గొప్పగా చరిత్రలో నిలిచిపోతుందన్నాడు.

 

అప్పుడు తాము స్వదేశంలో వరల్డ్ కప్ సాధించిన విషయాన్ని గంభీర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. 'మేము స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ సాధించాం. ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్లు అత్యంత క్లిష్టమైన కండిషన్లో ఫైనల్ వరకూ వచ్చారు. ఇంగ్లండ్ లో పిచ్ల్లో ఆసీస్ వంటి జట్టును ఓడించడం నిజంగా చాలా గ్రేట్. వరల్డ్ కప్ తో తిరిగొస్తే మాత్రం అది భారత మహిళా క్రికెట్ లో సువర్ణాధ్యాయమే'అని గంభీర్ తెలిపాడు.

అయితే ఆసీస్ తో నాకౌట్ సమరంలో హర్మన్ ప్రీత్(171 నాటౌట్) భారీ సెంచరీకి ఏ ఇన్నింగ్స్ సరిపోదంటూ కితాబిచ్చాడు. ఇక్కడ 1983 లో భారత్ జట్టు వరల్డ్ కప్ ను సాధించే క్రమంలో కపిల్ దేవ్ సాధించిన 175 పరుగులు కూడా హర్మన్ తాజా ఇన్నింగ్స్ తో పోల్చకూడదన్నాడు. ఆ సమయంలో కపిల్ దేవ్ నమోదు చేసిన పరుగులు లీగ్  స్టేజ్ లో అయితే, ఇప్పుడు హర్మన్ సాధించిన భారీ సెంచరీ నాకౌట్ స్టేజ్ లో అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నాడు. అసలు కపిల్ దేవ్ ఇన్నింగ్స్ తో హర్మన్ ఇన్నింగ్స్ ను పోల్చుతూ వార్తలు రాయడం సబబు కాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

Advertisement
Advertisement