లక్ష్యం 2020 ఒలింపిక్స్‌

5 Jan, 2019 10:27 IST|Sakshi

స్టార్‌ జిమ్నాస్ట్‌ అరుణా రెడ్డి

హైదరాబాద్‌: ‘విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌కి ఎంపికవ్వాలని, దేశానికి ప్రాతినిధ్యం వహించి, పతకం తేవాలనే ఆకాంక్ష, పట్టుదల, సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అదే పట్టుదలతో ఇంటి నుంచి వెళ్లాను. ఒలింపిక్స్‌ అర్హత కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాను. మొదటి క్వాలిఫికేషన్‌ గేమ్‌లో ‘ఫార్వర్డ్‌ 5/40’ చేస్తూ కిందకు దిగుతుండగా పడిపోయాను. ఎలా పడ్డానో.. ఏం జరిగిందో.. కూడా నాకు అర్థం కాలేదంటూ’ వివరించింది జిమ్నాస్టిక్స్‌ ప్రపంచ కప్‌ కాంస్య పతక విజేత బుద్దా అరుణా రెడ్డి. కాలికి బలమైన గాయం తగలడంతో క్వాలిఫయింగ్‌కు దూరమైయ్యింది. మూడు నెలల పాటు హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ హాస్పిటల్‌ వైద్యులు అరుణా రెడ్డికి చికిత్స చేశారు. చికిత్స విజయం కావడంతో శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో ఆమె ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అరుణా రెడ్డి మాట్లాడుతూ... ‘కాలికి గాయమైన సమయంలో నేను జర్మనీలో ఉన్నాను. గాయం తగ్గదని, ఆటకు దూరం అవుతానని చాలా మంది నన్ను భయపెట్టారు. మా కోచ్‌ని ఒప్పించి కాంటినెంటల్‌ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నాను.

ఇప్పుడు దెబ్బ తగిలిన ఫీలింగ్‌ లేకుండా నన్ను మామూలు మనిషిని చేశారు. గాయం నాలో చాలా కసిని పెంచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ఏడు క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లు ఉన్నాయి. మొదటి దాంట్లోనే నేను గాయంపాలై ఇంటి బాట పట్టాను. నేను ఇంకా పూర్తిగా కోలుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుంది. చివరి క్వాలిఫయింగ్‌ అక్టోబర్‌లో ఉంది. దానిలో పాల్గొంటా, అర్హత సాధిస్తా. 2020లో జరిగే ఒలిపింక్స్‌కు ఎంపికై దేశానికి పతకం తీసుకొస్తా. ఇప్పుడు నా ఆలోచన అంతా ఒలింపిక్స్‌పైనే ఉంది’ అని అరుణ పేర్కొంది. కాంటినెంటల్‌ హాస్పిటల్‌ సీఈఓ డాక్టర్‌ ఫైజల్‌ సిద్దిఖీ మాట్లాడుతూ... అరుణ ‘ఏసీఎల్‌ రీకన్‌స్రక్షన్‌’ కోసం మా వద్దకు వచ్చింది. అర్థోపెడిక్స్‌ డాక్టర్‌ మోహన్‌ రెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, శ్రీధర్‌ల పర్యవేక్షణలో శస్త్రచికిత్స చేశాం. ఏసీఎల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ విజయవంతం అయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా