ఇందర్‌జీత్‌కు స్వర్ణం | Sakshi
Sakshi News home page

ఇందర్‌జీత్‌కు స్వర్ణం

Published Wed, Jun 3 2015 11:58 PM

ఇందర్‌జీత్‌కు స్వర్ణం

 వుహాన్ (చైనా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత్ పసిడి బోణీ చేసింది. బుధవారం జరిగిన పురుషుల షాట్‌పుట్ ఈవెంట్‌లో ఇందర్‌జీత్ సింగ్ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. హర్యానాకు చెందిన 27 ఏళ్ల ఈ షాట్‌పుటర్ ఇనుప గుండును 20.41 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతోపాటు చాంపియన్‌షిప్‌లో కొత్త రికార్డును నమోదు చేశాడు. ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన ఇందర్‌జీత్ తాజా ప్రదర్శనతో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఎనిమిదో భారతీయ షాట్‌పుటర్‌గా నిలిచాడు.
 
 గతంలో జగ్‌రాజ్ సింగ్ (1973), బహదూర్ సింగ్ (1975), బల్వీందర్ సింగ్ (1985, 1989), శక్తి సింగ్ (2000), నవ్‌ప్రీత్ సింగ్ (2007), ఓంప్రకాశ్ సింగ్ (2009) ఈ ఘనత సాధించారు. తొలి రోజు జరిగిన ఇతర ఫైనల్స్‌లో మహిళల లాంగ్‌జంప్ ఈవెంట్‌లో మయూఖా జానీ (6.24 మీటర్లు) ఆరో స్థానాన్ని దక్కించుకోగా... 100 మీటర్ల హర్డిల్స్‌లో గాయత్రి గోవిందరాజన్ (13.69 సెకన్లు) ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. మహిళల 400 మీటర్ల విభాగంలో పూవమ్మ, లాంగ్‌జంపర్స్ అంకిత్ శర్మ, ప్రేమ్‌కుమార్, మహిళల 100 మీటర్ల విభాగంలో శ్రాబణి నందా ఫైనల్‌కు అర్హత పొందారు.
 

Advertisement
Advertisement