ముందే 'ఫైనల్' | Sakshi
Sakshi News home page

ముందే 'ఫైనల్'

Published Thu, Mar 26 2015 12:34 AM

ముందే 'ఫైనల్'

ఇక రెండే అడుగులు... మరోసారి జగజ్జేతగా నిలిచేందుకు, రెండే విజయాలు... క్రికెట్ ప్రపంచంపై మళ్లీ మువ్వన్నెల ముద్ర వేసేందుకు...ఆదివారం జరిగే అసలు ఫైనల్‌కు మించిన ఫైనల్‌లాంటి పోరు ఇది...ఆసీస్‌ను గెలిస్తే, కివీస్‌నూ కొట్టచ్చనే నమ్మకాన్నిచ్చే సమరమిది. అడ్డంకులు, అవరోధాలు దాటి అజేయంగా నిలిచిన ధోనిసేనకు అనకొండ లాంటి ప్రత్యర్థి ఎదురుగా ఉంది. దాన్ని కొట్టి, పడగొడితే శిఖరానికి చేరువైనట్లే. అందుకు అక్షయ తూనీరాలన్నీ సమర్థంగా పని చేయాలి. ఏమరుపాటుకు, అలసత్వానికి అవకాశం ఉండకూడదు.
 

ఇప్పటి వరకు ఆడిన ఆటంతా వేరు. ఈ ఒక్క మ్యాచ్‌లో ఆడాల్సిన ఆట వేరు. పాక్‌ను కొట్టినంత సులభం కాదు ఆసీస్‌ను ఓడించడం, దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచినంత సులువు కాదు ఆతిథ్య జట్టును నేలకూల్చడం. ప్రతి బంతికీ ప్రాణాలు పణంగా పెట్టినంతగా పోరాడాల్సి ఉంటుంది. చరిత్ర, గణాంకాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా ఫామ్, పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇది గెలిస్తే ఇక తిరుగుండదు. అందుకే నేడు ఆసీస్‌తో జరిగే ఫైనల్ లాంటి సెమీస్‌లో భారత్ గెలవాలి... గెలిచి తీరాలి...
 
సిడ్నీ: క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న రెండు జట్లు ఈ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఆసీస్‌కు 4 ప్రపంచకప్‌లు నెగ్గిన అనుభవం ఉండగా, భారత్ 2 సార్లు విజేతగా నిలిచింది. ఇరు జట్లు కలిపి 9 సార్లు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరాయి. ఈ టోర్నీలో ఆసీస్ సెమీస్‌కు చేరడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. సొంతగడ్డపై ఆడుతున్న ఆ జట్టు నంబర్‌వన్‌గా కూడా ఉంది. మరో వైపు భారత్ మాత్రం తమ ఆటతో ఒక్కసారిగా ప్రపంచకప్ సీన్ రివర్స్ చేసింది. అనూహ్య రీతిలో విజృంభించి అద్భుత విజయాలు సాధించింది. టోర్నీలో ఆసీస్ ఒక మ్యాచ్ ఓడింది. కానీ భారత్ వరుసగా ఏడు విజయాలతో అజేయంగా సాగింది.
 
 సన్నాహకాలు: భారత్ టోర్నీ ఆసాంతం తమ ప్రణాళిక ప్రకారమే విరామాలు ఇస్తూ సాధన చేసింది. మ్యాచ్ ప్రాధాన్యత దృష్ట్యా మొదటిసారి వరుసగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్‌లో పాల్గొంది. షార్ట్ బంతులు ఎదుర్కునేందుకు ప్రత్యేక తరహాలో ఆటగాళ్లు శ్రమించారు. ప్రతి ఒక్కరూ రాణిస్తుండటంతో ఆటగాళ్లలో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. మరో వైపు ఆస్ట్రేలియా పైకి ఎంత గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, లోలోపల స్పిన్ వారిని ఆందోళన పరుస్తోంది. షేన్‌వార్న్ పర్యవేక్షణలో సిద్ధం కావడం అందుకు నిదర్శనం. సొంతగడ్డపై కచ్చితంగా మ్యాచ్ గెలవాల్సిన ఒత్తిడిలో ఆ జట్టు కనిపిస్తోంది. పాత గణాంకాలు మాత్రం కాస్త భారత్‌కు ప్రతికూలంగా ఉన్నాయి.
 
 వీరు ఎలా ఆడతారో: భారత్ బ్యాటింగ్ తిరుగులేనిదిగా కనిపిస్తోంది. పేసర్లు కూడా చెలరేగిపోతున్నారు. ఇక సిడ్నీలో అశ్విన్, జడేజా కీలకం కావచ్చు. ఫామ్‌లో ఉన్న వీరిద్దరి స్పిన్‌ను ఆసీస్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం. అయితే మ్యాక్స్‌వెల్ రికార్డు వీరిపై ఘనంగా ఉంది. వీరిద్దరిని కలిపి అతను తాను ఎదుర్కొన్న 78 బంతుల్లో 124 పరుగులు చేశాడు. క్వార్టర్స్‌లో చెలరేగిన రోహిత్ శర్మ ఆసీస్‌పై ఆడిన గత  రెండు మ్యాచ్‌లలో సెంచరీ, డబుల్ సెంచరీ చేశా డు. కాబట్టి రోహిత్‌ను ఆపేందుకు ఆసీస్ బౌలర్లు ప్రయత్నిస్తారు. ఫామ్‌లో ఉన్న స్టార్క్‌పై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది.
 
 మార్పులు చేర్పులు: ఏడు మ్యాచ్‌లలో ఏడు విజయాలు, ప్రతీ సారి ప్రత్యర్థి ఆలౌట్. ఇలాంటి జట్టును మార్చేందుకు ఏ కెప్టెన్ కూడా ఆలోచించడు. ఎవరికైనా గాయం అయితే తప్ప భారత జట్టులో మార్పు ఉండదు. స్పిన్ గురించి ఎంత చర్చ జరిగినా తమ బలమైన పేస్ అటాక్‌ను మార్చి ఆస్ట్రేలియా స్పిన్నర్‌ను తీసుకునే అవకాశం లేదు.
 
 జట్లు: భారత్ (అంచనా): ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, రహానే, జడేజా, అశ్విన్, ఉమేశ్, షమీ, మోహిత్.  ఆస్ట్రేలియా (అంచనా): క్లార్క్ (కెప్టెన్), వార్నర్, ఫించ్, స్మిత్, వాట్సన్, మ్యాక్స్‌వెల్, హాడిన్, ఫాల్క్‌నర్, జాన్సన్, స్టార్క్, హాజల్‌వుడ్
 
 ప్రపంచ నంబర్‌వన్ జట్టు కావడంతో సహజంగానే మాపై అంచనాలు ఉన్నాయి. బాగా ఆడుతున్నాం కాబట్టి మననుంచి అంతా విజయాలు ఆశిస్తారు. ఈ స్థాయిలో ఆడేటప్పుడు ఒత్తిడి, అంచనాలు తప్పవు. మా స్థాయికి తగినట్లుగా ఆడితే ఏ మ్యాచ్‌లోనైనా గెలుస్తాం. నన్ను నేను బ్యాట్స్‌మన్‌గా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. వన్డేలు ఆడినవాళ్లలో నా రికార్డు చాలా బాగుంది.
 - మైకేల్ క్లార్క్, ఆసీస్ కెప్టెన్  
 
 పెద్ద మ్యాచ్‌లలో మా ఆటగాళ్లంతా చాలా బాగా ఆడతారు. వరుస విజయాల రుచిని మేం ఆస్వాదిస్తున్నాం. మేం కచ్చితమైన ప్రణాళికలతో ఈ మ్యాచ్‌కు సిద్ధమయ్యాం. స్పిన్‌పైనే జట్టు ఆధారపడి లేదు. మంచి పేస్‌తో ఆసీస్‌ను కూడా ఇబ్బంది పెట్టొచ్చని పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చూ శాం. కాబట్టి వారు అజేయులేమీ కాదు. టెస్టులు, ముక్కోణపు సిరీస్ ప్రదర్శన అంతా గతం. ఇప్పుడు మేం చాలా బాగా ఆడుతున్నాం. భారత్ జెర్సీని ధరించడమే నాకు పెద్ద స్ఫూర్తి అయితే ప్రతీ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేయడం సాధ్యం కాదు.
 -రోహిత్ శర్మ, భారత బ్యాట్స్‌మన్
 
 పిచ్, వాతావరణం
 శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య క్వార్టర్స్ మ్యాచ్ జరిగిన పిచ్‌నే వాడబోతున్నారు. పెద్దగా పచ్చిక లేకుండా పిచ్‌ను రోలింగ్ చేశారు. ఆసీస్ బౌలర్లు ఆశిస్తున్న బౌన్స్ ఇక్కడ దక్కకపోవచ్చు. స్పిన్‌కు కాస్త అనుకూలించవచ్చని అనిపిస్తున్నా... ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో లెగ్‌స్పిన్నర్ తాహిర్‌కు మినహా మరో స్పిన్నర్‌కు పెద్దగా బంతి తిరగలేదు. మొత్తంగా ఆసీస్‌కంటే భారత్‌కే కాస్త అనుకూలంగా పరిస్థితి కనిపిస్తోంది. నాకౌట్ మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచిన జట్టు నిస్సందేహంగా బ్యాటింగ్ ఎంచుకోవచ్చని నిపుణుల సూచన. అయితే 2011నుంచి జరిగిన వన్డేల్లో 9 సార్లు రెండో బ్యాటింగ్ చేసిన జట్టే ఇక్కడ గెలిచింది. గురువారం వర్షసూచన లేదు.
 
 సెమీస్‌కు చేరాయిలా...
 భారత్
 పాకిస్తాన్‌పై 76 పరుగుల విజయం
 దక్షిణాఫ్రికాపై 130 పరుగుల గెలుపు
 యూఏఈపై 9 వికెట్లతో విజయం
 వెస్టిండీస్‌పై 4 వికెట్ల గెలుపు
 ఐర్లాండ్‌పై 8 వికెట్ల విజయం
 జింబాబ్వేపై 6 వికెట్లతో గెలుపు
 బంగ్లాదేశ్‌పై 109 పరుగుల విజయం (క్వార్టర్స్)
 
 ఆస్ట్రేలియా
 ఇంగ్లండ్‌పై 111 పరుగుల విజయం
 బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షంతో రద్దు
 న్యూజిలాండ్ చేతిలో ఒక్క వికెట్‌తో ఓటమి
 అఫ్ఘానిస్తాన్‌పై 275 పరుగుల విజయం
 శ్రీలంకపై 64 పరుగులతో గెలుపు
 స్కాట్లాండ్‌పై 7 వికెట్ల విజయం
 పాకిస్తాన్‌పై 6 వికెట్లతో గెలుపు (క్వార్టర్స్)
 
 1      భారత్, ఆసీస్ మధ్య సిడ్నీలో 13 వన్డేలు జరగ్గా టీమిండియా ఒక్కటే (2008లో) గెలిచింది.
 10     ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై భారత్ 10 వన్డేలు గెలిచి, 30 ఓడింది.
 0     ఆసీస్ ఆరు సార్లు ప్రపంచకప్ సెమీస్ చేరి ఒక్కసారి కూడా ఓడలేదు. ప్రతీసారి ఫైనల్‌కు వెళ్లింది.
 8     సిడ్నీలో గత పది మ్యాచ్‌లలో ఆసీస్ 8 నెగ్గింది.
 21.64 ప్రపంచకప్‌లో భారత బౌలింగ్ సగటు ఇది. ఇప్పటివరకు మనదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.

Advertisement

తప్పక చదవండి

Advertisement