Sakshi News home page

రైనా సెంచరీ: సిరీస్ భారత్ కైవసం

Published Sun, Sep 20 2015 5:29 PM

రైనా సెంచరీ: సిరీస్ భారత్ కైవసం

బెంగళూరు:అనధికార మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు సురేష్ రైనా దుమ్మురేపాడు. బంగ్లాదేశ్ 'ఎ' తో జరిగిన చివరి మ్యాచ్ లో రైనా సెంచరీతో ఆకట్టుకోవడంతో భారత్ 'ఎ' జట్టు ఘన విజయం సాధించింది. తనదైన శైలిలో రెచ్చిపోయిన రైనా(104;95 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయడంతో భారత్ 'ఎ' జట్టు సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

 

మూడు వన్డేల అనధికార సిరీస్ లో భాగంగా ఆదివారం బెంగళూరులో జరిగిన చివరి వన్డేలో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత 'ఎ' జట్టు నిర్ణీత ఓవర్లలో 297 పరుగులు చేసింది. అనంతరం వర్షం పడటంతో బంగ్లా లక్ష్యాన్ని 32 ఓవర్లలో 217 పరుగులకు నిర్దేశించారు. కాగా, బంగ్లాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బతగిలింది. సౌమ్య సర్కారు(1), రోనీ తలుద్కర్(9), అనముల్ హక్(1) లు పెవిలియన్ కు చేరారు. తరువాత సబ్బిర్ రెహ్మాన్(41), మునిమల్ హక్(37), నాసిర్ హుస్సేన్(22) చేయడంతో  ఫర్వాలేదనిపించినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు. బంగ్లా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి141 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో శ్రీశాంత్ అరవింద్, కులదీప్ యాదవ్ లకు తలో రెండు వికెట్లు లభించాయి.


భారత కుర్రాళ్లలో మయాంక్ అగర్వాల్ (4)పరుగులు చేసి ఆదిలోనే పెవిలియన్ కు చేరగా, కెప్టెన్ ఉన్ముక్త్ చంద్(41)పరుగులతో మరోసారి ఆకట్టుకున్నాడు. అనంతరం సురేష్ రైనా(104) సెంచరీకి తోడు సంజా శాంసన్(90) పరుగులతో మెరిశాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోరు చేయడంలో సహకరించారు.

Advertisement
Advertisement