భారత్-చైనా మ్యాచ్ ‘డ్రా’ | Sakshi
Sakshi News home page

భారత్-చైనా మ్యాచ్ ‘డ్రా’

Published Tue, Mar 10 2015 1:06 AM

భారత్-చైనా మ్యాచ్ ‘డ్రా’

ద్వైపాక్షిక చెస్ టోర్నీ
 
సాక్షి, హైదరాబాద్: ద్వైపాక్షిక చెస్ టోర్నమెంట్‌లో భారత్ సిరీస్ విజయానికి దాదాపు దూరమైనట్లే! చైనాతో సోమవారం జరిగిన ఏడో రౌండ్ పోరును భారత్ 1.5-1.5తో డ్రా చేసుకుంది. దీంతో చివరిదైన ఎనిమిదో రౌండ్లో భారత్ మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లోనూ (4-0తో) చైనా ఆటగాళ్లను మట్టికరిపించాల్సి వుంటుంది. ఇప్పటికే వెనుకంజలో ఉన్న భారత ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో అందరూ కచ్చితంగా గెలుస్తారనుకోవడం అత్యాశే అవుతుంది.

భారత చెస్ సమాఖ్య సౌజన్యంతో తెలంగాణ చెస్ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడి మారియట్ హోటల్‌లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఏడో రౌండ్ పోటీల్లో భారత్ తరఫున సేతురామన్ ఒక్కడే గెలుపొందాడు. మిగిలిన వారిలో గ్రాండ్‌మాస్టర్లు ఆధిబన్, లలిత్‌బాబులిద్దరూ తమ తమ గేముల్ని డ్రా చేసుకోగా, కృష్ణన్ శశికిరణ్ పరాజయం చవిచూశాడు. తొలి బోర్డులో ఆధిబన్... వాంగ్ చెన్‌తో జరిగిన గేమ్‌ను డ్రాగా ముగించాడు. సిసిలియన్ డిఫెన్స్‌తో గేమ్‌ను ప్రారంభించిన ఆధిబన్ పోరాడినప్పటికీ... చివరకు 88 ఎత్తుల్లో డ్రాతో సరిపెట్టుకున్నాడు.

గ్రాండ్‌మాస్టర్ సేతురామన్ అసాధారణ ఆటతీరుతో డింగ్ లిరెన్‌ను కంగుతినిపించాడు. గ్రున్‌ఫెల్డ్ డిఫెన్స్‌తో మొదలైన ఈ గేమ్‌లో భారత ఆటగాడు కేవలం 23 ఎత్తుల్లోనే ప్రత్యర్థిని చిత్తుచేశాడు. మూడో బోర్డులో వే యితో జరిగిన పోరులో శశికిరణ్ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ గేమ్ కూడా గ్రున్‌ఫెల్డ్ డిఫెన్స్‌తో ఆరంభించినప్పటికీ శశికిరణ్ 40 ఎత్తుల్లో వే యి చేతిలో ఓడిపోయాడు. నాలుగో బోర్డులో తలపడిన తెలుగు కుర్రాడు లలిత్‌బాబు... జౌ జియాంచోతో జరిగిన గేమ్‌ను 47 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement