సిరీస్ పై కన్నేసిన టీమిండియా | Sakshi
Sakshi News home page

సిరీస్ పై కన్నేసిన టీమిండియా

Published Sat, Aug 26 2017 2:08 PM

సిరీస్ పై కన్నేసిన టీమిండియా - Sakshi

పల్లెకెలె: తొలి రెండు వన్డేల్లో విజయాలతో జోరు మీదున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా సిరీస్ పై కన్నేసింది. హ్యాట్రిక్ విజయాలు సాధించి ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో పోరాడి గెలిచింది. దాంతో సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఆదివారం పల్లెకెలె వేదికగా జరుగుతున్న మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకునేందుకు భారత్ కసరత్తు చేస్తోంది. ఇక్కడే జరిగిన రెండో వన్డేలో ఓటమి అంచుల వరకూ వెళ్లి గట్టెక్కిన విరాట్ సేన.. ఈసారి ఎటువంటి ఉదాసీనతకు తావివ్వకూడదనే యోచనలో ఉంది. రేపు మధ్యాహ్నం గం.2.30 ని.లకు ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరుగనుంది.

 

ఒకవైపు సిరీస్ కోసం భారత్ తపిస్తుంటే, మరొకవైపు లంకేయులి పరువు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఓవరాల్ ద్వైపాక్షిక సిరీస్ లో ఇప్పటివరకూ శ్రీలంక బోణి కొట్టలేదు. దాంతో  కనీసం ఒక్క మ్యాచ్ ను గెలిచి గౌరవం కాపాడుకోవాలనే యోచనలో లంక ఉంది. కాగా, శ్రీలంక రెండు వన్డేల్లో విజయం సాధిస్తే నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ ను నిలువరించేందుకు లంక జట్టు శాయశక్తులా ఒడ్డుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


ఇది  మూడోది మాత్రమే..

ఈ స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య పెద్దగా వన్డేలు జరగలేదు. మొన్న జరిగిన రెండో వన్డే ఒకటైతే, అంతకుముందు ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ఇక్కడ భారత్ ఆడింది. 2012లో పల్లెకెలెలో శ్రీలంకతో ఆడిన తన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తరువాత గత గురువారం జరిగిన మ్యాచ్ లో భారత్ మూడు వికెట్లతో గెలుపొందింది. రేపటి మ్యాచ్ లో భారత్ గెలిస్తే ఇక్కడ హ్యాట్రిక్ విజయాల్ని సాధించడమే కాకుండా, సిరీస్ ను కూడా దక్కుతుంది.

ఇదిలా ఉంచితే ఇరు జట్ల మధ్య 1985 నుంచి చూస్తే 26 ద్వైపాక్షిక వన్డేలు జరిగాయి.  అందులో భారత్ 13 మ్యాచ్ ల్లో విజయం సాధించగా, లంకేయులు 10 వన్డేలు గెలిచారు.మూడు మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు. చివరిసారి 2012లో భారత్-శ్రీలంక జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. శ్రీలంకలో జరిగిన ఆ సిరీస్ ను భారత్ 4-1 తో సొంతం చేసుకుంది. ఈసారి కూడా భారత్ వన్డే సిరీస్ ను 'భారీ' తేడాతో గెలవాలనే యోచనలో్ ఉంది. శ్రీలంక అనుభవలేమిని తమకు వరంగా మార్చుకుని సిరీస్ ను వైట్ వాష్ చేయాలనే భావనలో కోహ్లి అండ్ గ్యాంగ్ ఉంది.  ఎంఎస్ ధోని సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లంకతో జరిగిన మూడు వన్డే సిరీస్ లను భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక్కడ ఇలా..

మొదటి ఇన్నింగ్స్ యావరేజ్.. 242 పరుగులు

రెండో ఇన్నింగ్స్ యావరేజ్.. 198 పరుగులు

అత్యధిక స్కోరు 327/6(50 ఓవర్లు), జింబాబ్వేపై శ్రీలంక

అత్యల్ప స్కోరు 167 ఆలౌట్(43.2 ఓవర్లు) దక్షిణాఫ్రికాపై శ్రీలంక

అత్యధిక పరుగుల ఛేజింగ్; 288/8(48.1 ఓవర్లు) పాకిస్తాన్ పై శ్రీలంక

Advertisement
Advertisement