ఊరించి... ఉస్సూరు... | Sakshi
Sakshi News home page

ఊరించి... ఉస్సూరు...

Published Sun, Dec 14 2014 12:29 AM

ఊరించి... ఉస్సూరు...

తొలి టెస్టులో భారత్ ఓటమి
 48 పరుగులతో ఆసీస్ విజయం
 కోహ్లి, విజయ్‌ల శ్రమ వృథా
 లయోన్‌కు 7 వికెట్లు
 17 నుంచి రెండో టెస్టు

 
 భారత్ లక్ష్యం... 364 పరుగులు. అప్పటికి స్కోరు 242/2... కోహ్లి, విజయ్ అద్భుతంగా ఆడుతున్నారు... ఇక కావలసింది 122 పరుగులే... భారత్ గెలవడం ఖాయం. ఆస్ట్రేలియా గడ్డపై కుర్రాళ్లు సంచలనం సృష్టించడమే తరువాయి...
 
 ఈ సమయంలో ఊహించని మలుపు... విజయ్ 99 పరుగులకు ఎల్బీగా అవుటయ్యాడు. అయినా గెలిచే అవకాశం ఉంది. ఒక ఎండ్‌లో కోహ్లి చెలరేగుతున్నాడు... భారత్  స్కోరు 304/6.... ఇక 60 చేస్తే చాలు. భారత అభిమానుల్లో కోటి ఆశలు..
 
 ఈ లోగా మరో షాక్... కోహ్లి అవుటయ్యాడు... అంతే భారత్ చతికిలపడింది. 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. అప్పటివరకూ ఊరించిన కోహ్లిసేన... ఉస్సూరుమనిపించింది. ఆసీస్ స్పిన్నర్ లయోన్ మ్యాజిక్ చేయడంతో... భారత్ 73 పరుగుల  వ్యవధిలో చివరి 8 వికెట్లు కోల్పోయింది. స్పిన్‌ను బాగా ఆడతారనే పేరున్న భారత బ్యాట్స్‌మెన్‌ను... ఆస్ట్రేలియా గడ్డపై ఓ స్పిన్నర్ నియంత్రించడం కాస్త ఆశ్చర్యమే.
 
 ఫలితం ఎలా ఉన్నా... భారత జట్టు ఆశావహ దృక్పథంతో గెలుపుకోసం ఆడటం         
 అభినందించదగ్గ విషయం. హ్యూస్‌కు నివాళిలా జరిగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు               
 మరచిపోలేని క్రికెట్ వినోదాన్ని అందించింది.
 
 1కెప్టెన్ గా తొలి టెస్టులో అత్యధిక పరుగులు (256) చేసిన క్రికెటర్ కోహ్లి. గతంలో ఈ రికార్డు న్యూజి లాండ్ ఆటగాడు డౌలింగ్ (244) పేరిట ఉండేది.
 
 10 ఆస్ట్రేలియాలో ఓ స్పిన్నర్ మ్యాచ్‌లో పది వికెట్లు తీసి పదేళ్లయింది. 2004లో ఉపుల్ చందన (శ్రీలంక) తర్వాత మళ్లీ లయోన్ ఇప్పుడు ఈ ఘనత సాధించాడు.
 
 2 99 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూ అయిన రెండో భారత బ్యాట్స్‌మన్ విజయ్. గతంలో సిద్ధు ఇలా అవుటయ్యాడు.
 
 12భారత్‌పై టెస్టులో అత్యుత్తమ బౌలింగ్ (12/286) గణాంకాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా స్పిన్నర్‌గా లయోన్.
 
 53ఓ విదేశీ క్రికెటర్ ఆస్ట్రేలియాలో టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేసి 53 ఏళ్లయింది. 1961లో రోహన్ కన్హాయ్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కోహ్లి ఈ ఘనత సాధించాడు.
 
 4 ఆసీస్‌పై కోహ్లికి ఇది నాలుగో శతకంకాగా టెస్టుల్లో 8వది. టెస్టుల్లో కోహ్లి అత్యధిక స్కోరు (141) కూడా ఈ మ్యాచ్‌లోనే సాధించాడు.
 
 అడిలైడ్: ఆస్ట్రేలియా గడ్డపై భారత కుర్రాళ్లు సంచలనం సృష్టించే గొప్ప అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నారు. కెప్టెన్ కోహ్లి (175 బంతుల్లో 141; 16 ఫోర్లు, 1 సిక్స్), మురళీ విజయ్ (234 బంతుల్లో 99; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత ఆటతీరుతో విజయం ముంగిట వరకు వచ్చినా.... మిగతా సహచరులు ఒత్తిడిని జయించలేక చివర్లో చేతులెత్తేశారు. దీంతో అడిలైడ్ ఓవల్‌లో శనివారం ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.
 
  ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో క్లార్క్‌సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. 364 పరుగుల విజయ లక్ష్యంతో ఆఖరి రోజు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 87.1 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను ఓవర్‌నైట్ స్కోరు 290/5 వద ్దనే డిక్లేర్ చేసింది.
 
 మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యం
 లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్‌లో ధావన్ (9), పుజారా (21) నిరాశపర్చారు. అయితే 57 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్‌ను కోహ్లి, విజయ్ వీరోచిత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఓవర్‌కు నాలుగు రన్‌రేట్‌తో మూడో వికెట్‌కు 185 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్ 70వ ఓవర్‌లో స్పిన్నర్ లయోన్.. భారత్‌ను దెబ్బతీశాడు.

ఐదు బంతుల వ్యవధిలో విజయ్‌తో పాటు రహానే (0)ను అవుట్ చేశాడు. కోహ్లి నిలకడను చూపెట్టినా మిగతా వారు స్పిన్నర్‌ను అడ్డుకోలేకపోయారు. తన వరుస మూడు ఓవర్లలో రోహిత్ (6), సాహా (13), కోహ్లిలను అవుట్ చేయడంతో భారత్ పూర్తిగా తడబడింది. చివర్లో ఓ ఎండ్‌లో కరణ్ శర్మ (4నాటౌట్)ను నిలబడ్డా... రెండో ఎండ్ లో ఆరు పరుగుల తేడాతో షమీ (5), ఆరోన్ (1), ఇషాంత్ (1) వెనుదిరగడం తో ఓటమి తప్పలేదు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లయోన్ 7, జాన్సన్ 2 వికెట్లు తీశారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ప్రస్తు తం ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు బ్రిస్బేన్‌లో ఈనెల 17 నుంచి జరుగుతుంది.
 
 స్కోరు వివరాలు
 ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 517/7 డిక్లేర్డ్
 భారత్ తొలి ఇన్నింగ్స్: 444 ఆలౌట్
 ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 290/5 డిక్లేర్డ్
 భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబ్ల్యూ (బి) లయోన్ 99; ధావన్ (సి) హాడిన్ (బి) జాన్సన్ 9; పుజారా (సి) హాడిన్ (బి) లయోన్ 21; కోహ్లి (సి) మార్ష్ (బి) లయోన్ 141; రహానే (సి) రోజర్స్ (బి) లయోన్ 0; రోహిత్ (సి) వార్నర్ (బి) లయోన్ 6; సాహా (బి) లయోన్ 13; కరణ్ నాటౌట్ 4; షమీ (సి) జాన్సన్ (బి) హారిస్ 5; ఆరోన్ ఎల్బీడబ్ల్యూ (బి) జాన్సన్ 1; ఇషాంత్ (స్టంప్డ్) హాడిన్ (బి) లయోన్ 1; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: (87.1 ఓవర్లలో ఆలౌట్) 315.
 వికెట్ల పతనం: 1-16; 2-57; 3-242; 4-242; 5-277; 6-299; 7-304; 8-309; 9-314; 10-315; బౌలింగ్: జాన్సన్ 16-2-45-2; హారిస్ 19-6-49-1; లయోన్ 34.1-5-152-7; సిడిల్ 9-3-21-0; వాట్సన్ 2-0-6-0; స్మిత్ 3-0-18-0; మార్ష్ 4-1-11-0.
 
 డ్రా కోసం కాకుండా గెలుపు కోసం ప్రయత్నించాం. ఈ క్రమంలో ఓడినందుకు బాధలేదు. ఒకవేళ డ్రా కోసం ప్రయత్నిస్తే 150 పరుగుల తేడాతో ఓడేవాళ్లం. స్ట్రోక్స్ మీద నమ్మకం ఉంటే ఆడమని సహచరులకు చెప్పా. విజయ్, నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మ్యాచ్ మా చేతిలోనే ఉంది. ఓడతామని ఏ దశలోనూ అనుకోలేదు. విజయ్ అవుట్ కావడం టర్నింగ్ పాయింట్. సాహా వరకు గెలుపుపై ఆశలు వదులుకోలేదు. వీలైనంత నాకు స్ట్రయిక్ ఇవ్వమని కరణ్‌కు చెప్పా. మ్యాచ్ గెలిచి ఉంటే నా జీవితంలో ప్రత్యేకంగా నిలిచి ఉండేది. ఈ విజయానికి వారు అర్హులు.             
  - కోహ్లి (భారత కెప్టెన్)
 
అంపైర్లు ‘ముంచారు’
తొలి టెస్టులో అంపైర్ల తప్పుడు నిర్ణయా లు కూడా భారత్ ఓటమికి దారితీశాయి. లయో న్ వేసిన 70వ ఓవర్ చివరి బంతిని రహానే అడ్డుకునే ప్రయత్నంలో షార్ట్ లెగ్‌లో రోజర్స్ చేతి లోకి వెళ్లింది. దీంతో ఆటగాళ్లు అప్పీలు చేయడంతో అంపైర్ అవుటిచ్చాడు. కానీ రీప్లేలో బంతి బ్యాట్‌ను కాకుండా ప్యాడ్‌ను తాకిందని తేలింది. 78వ ఓవర్‌లో కూడా లయోన్ వేసిన బంతి రోహిత్ గ్లోవ్స్ పైనుంచి వెళ్లినా అవుటిచ్చారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement