దక్షిణాఫ్రికాకు వెళ్లక ముందే... | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాకు వెళ్లక ముందే...

Published Tue, Nov 14 2017 12:27 AM

India needs pace pitch - Sakshi

కోల్‌కతా: శ్రీలంకతో తొలి టెస్టుకు మూడు రోజుల ముందు ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ పచ్చికతో కళకళలాడుతోంది! ఆశ్చర్యకరమే అయినా ఇది వాస్తవం. సోమవారం పిచ్‌ను చూస్తే భారత్‌ ఎప్పటిలా స్పిన్‌ వికెట్‌ను కోరుకోవట్లేదని మాత్రం అర్థమవుతోంది. తాజా పరిస్థితి ప్రకారం మ్యాచ్‌ జరిగే సమయానికి కూడా ఇందులో మార్పు ఉండకపోవచ్చు. నిజానికి ఈ తరహా వికెట్‌ తమకు కావాలని భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అడగడం వల్లే దీనిని సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో జరిగే దక్షిణాఫ్రికా పర్యటన కోసం సన్నాహకంగా ఇలాంటి పిచ్‌ బాగుంటుందని జట్టు అభిప్రాయ పడటంతో బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) దానికి అనుగుణంగా స్పందించింది.

ఈ నేపథ్యంలో భారత జట్టు తుది జట్టులో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. షమీ, ఉమేశ్‌లతో పాటు భువనేశ్వర్‌ లేదా ఇషాంత్‌లలో ఒకరిని ఎంపిక చేయవచ్చు. ఇద్దరు స్పిన్నర్లకు అవకాశం ఉండగా అశ్విన్‌తో పాటు జడేజా, కుల్దీప్‌లలో ఒకరే తుది జట్టులో ఉంటారు. సరిగ్గా ఏడాది క్రితం ఈ మైదానంలో జరిగిన భారత్, న్యూజిలాండ్‌ టెస్టులో మొత్తం 40 వికెట్లలో 26 పేసర్లే పడగొట్టారు. మరోవైపు భారత జట్టు సోమవారం స్టేడియంలో సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌ చేసింది. రివర్స్‌ స్వింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేయించిన ఎరుపు–పసుపు రంగు బంతులతో కెప్టెన్‌ కోహ్లి ఎక్కువగా సాధన చేయడం విశేషం.   

Advertisement

తప్పక చదవండి

Advertisement