బాక్సింగ్‌ డే టెస్ట్‌ : రాణించిన భారత బ్యాట్స్‌మెన్‌ | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 26 2018 12:55 PM

India onTop With Pujara and Kohli Comfortable at Stumps - Sakshi

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్‌ తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. చతేశ్వర పుజారా( 200 బంతుల్లో 68 బ్యాటింగ్‌: 6 ఫోర్లు), విరాట్‌ కోహ్లి (107 బంతుల్లో 47 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు ఇప్పటికే మూడో వికెట్‌కు అభేద్యంగా 92 పరుగులు జోడించారు. అంతకు మందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ వ్యూహాత్మకంగా మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారీలను ఓపెనర్లుగా బరిలోకి దింపింది. 

అరంగేట్రంలో అర్థసెంచరీ‌..
ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్‌ అగర్వాల్‌ అర్ధశతకంతో ఔరా అనిపించాడు. జట్టు స్కోర్‌ 40 వద్ద హనుమ విహారీ (8) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో మయాంక్‌ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో 95 బంతుల్లో ఆరు ఫోర్లతో కెరీర్‌లో తొలి హాఫ్‌సెంచరీ నమోదు చేశాడు. తద్వార అరంగేట్ర టెస్ట్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన ఏడో భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్‌ గుర్తింపు పొందాడు. పెర్త్‌ టెస్ట్‌ పరాజయంతో జట్టులో సమూల మార్పులు చేసిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌.. ఉన్నపళంగా ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ను రప్పించి తుది జట్టులో అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని మయాంక్‌ చక్కగా సద్వినియోగం చేసుకుని తనపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆచితూచి ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్లిన మయాంక్‌(161 బంతుల్లో 76: 8 ఫోర్లు, 1 సిక్స్‌)ను ప్యాట్‌ కమిన్స్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

పుజారా హాఫ్‌ సెంచరీ..
మయాంక్‌ వికెట్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లితో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ప్రారంభంలో దాటిగా ఆడిన కోహ్లి.. అనంతరం నెమ్మదించాడు. ఈ ఇద్దరు ఆచితూచి ఆడుతూ మరో వికెట్‌ పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో 152 బంతుల్లో 4 ఫోర్లతో పుజారా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి కూడా హాఫ్‌ సెంచరీ చేరువగా వచ్చినప్పటికి తొలి రోజు ఆట ముగిసింది.

Advertisement
Advertisement