Sakshi News home page

ఆసీస్ విజృంభణ

Published Tue, Oct 10 2017 8:49 PM

india set target of 119 runs against australia

గువాహటి: భారత్ తో ఇక్కడ బర్సపరా స్టేడియంలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చెలరేగిపోయింది. పదునైన బౌలింగ్ తో భారత్ ను ముప్పుతిప్పలు పెట్టింది. విరాట్ సేనను ఏ దశలోనూ తేరుకోనీయకుండా చేసి ఆద్యంతం ఆకట్టుకుంది.  ఫలితంగా టీమిండియా 119 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. టీమిండియా ఆటగాళ్లు వరుసపెట్టి క్యూకట్టడంతో బ్యాటింగ్ పిచ్ కాస్తా బౌలింగ్ పిచ్ ను తలపించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆది నుంచి తడబడుతూనే ఇన్నింగ్స్ కొనసాగించింది. భారత జట్టులో ఏ ఒక్కరూ ఆకట్టుకోలేక పోవడంతో స్వల్ప స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. తొలుత 27 పరుగులకే కష్టాల్లో పడిన టీమిండియాను కేదర్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోని చక్కదిద్దే యత్నం చేశారు. ఈ జోడి ఐదో వికెట్ 33 పరుగుల జత చేసి కొద్దిగా ఊరట చేకూర్చారు. కాగా, ధోని(13), జాదవ్(27)లు ఓవర్ వ్యవధిలో ఆడమ్ జంపా బౌలింగ్ లో అవుట్ కావడంతో భారత్ 67 పరుగుల వద్ద ఆరో వికెట్ ను నష్టపోయింది. ఆపై భువనేశ్వర్ కుమార్(1) నిష్క్రమించాడు. దాంతో భారత్ జట్టు వంద పరుగుల మార్కును చేరడానికి అపోసోపాలు పడింది. కాగా, హార్దక్ పాండ్యా(25), కుల్దీప్ యాదవ్(16) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ చివరి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆసీస్ బౌలర్లలో పేసర్ జాసన్ బెహ్రెన్ డార్ఫ్ నాలుగు వికెట్లతో రాణించగా, స్పిన్నర్ ఆడమ్ జంపా రెండు వికెట్లు తీశాడు. కౌల్టర్ నైల్, స్టోనిస్, ఆండ్రూ టైలు తలో వికెట్ తీశారు.

Advertisement
Advertisement