‘పిచ్’ పంచాయతీ | Sakshi
Sakshi News home page

‘పిచ్’ పంచాయతీ

Published Thu, Dec 3 2015 12:14 AM

‘పిచ్’ పంచాయతీ

 ఐసీసీతోనే కోహ్లి ఢీ!
 మాజీ ఆటగాళ్ల వాగ్వాదాలు

 
 భారత జట్టు దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ సొంతం చేసుకుందనేది వాస్తవం. స్పిన్ ప్రభావమో, సఫారీల బ్యాటింగ్ వైఫల్యమో... కారణం ఏదైనా భారత్ సిరీస్ గెలిచింది. అయితే నేరుగా తన ప్రమేయం లేకపోయినా పిచ్‌ల చుట్టూ సాగుతున్న చర్చ భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి విజయానందాన్ని దూరం చేస్తోంది. భవిష్యత్తులోనూ సొంతగడ్డపై తన తొలి విజయాన్ని ఘనంగా చెప్పుకునే అవకాశం లేకుండా పోతోంది. ఒక దశలో రచ్చ ముగిసిపోయినట్లు కనిపించినా... నాగ్‌పూర్ వికెట్‌పై ఐసీసీ వివరణ కోరడంతో వాతావరణం మళ్లీ వేడెక్కింది. వికెట్‌పై వస్తున్న విమర్శలకు కెప్టెన్, డెరైక్టర్ కలిసి ఎదురుదాడి మొదలు పెట్టారు.
 
 న్యూఢిల్లీ: మొహాలీ టెస్టు మూడు రోజుల్లోపే ముగిసినా ఇంతగా విమర్శలు రాలేదు. బెంగళూరులో తొలి రోజే దక్షిణాఫ్రికా ఆలౌటైనా పెద్దగా చర్చ జరగలేదు. కానీ నాగ్‌పూర్‌లో సఫారీలు చిత్తుగా ఓడిన తర్వాత మాత్రం ‘పిచ్ పాపం’ అంటూ అన్ని వైపులనుంచి విమర్శలు మొదలయ్యాయి. అనూహ్యంగా ఐసీసీ కూడా జామ్‌తాపై నివేదిక ఇవ్వాలంటూ బీసీసీఐని కోరడం పిచ్‌ల పనితీరుపై తేనెతుట్టను కదిలించింది. సరిగ్గా ఇదే విషయం భారత కెప్టెన్ కోహ్లికి మంట తెప్పించింది. దాంతో అతను ఐసీసీపైనే తన వ్యాఖ్యల గురి పెట్టాడు. ‘పిచ్ గురించి పదే పదే వచ్చిన కథనాల గురించే కాదు. వికెట్ గురించి వివరణ కోరుతున్న వారి గురించి (పరోక్షంగా ఐసీసీని ఉద్దేశించి) కూడా మాట్లాడుతున్నా. ఎక్కడా దీనిని పట్టించుకోకపోయినా మన దగ్గర మాత్రం పిచ్‌పైనే అందరూ దృష్టి పెడతారు. పరాయి దేశంలో మనం ఓడితే ఆట చేత కానట్లు. అదే వారు ఇక్కడ ఓడితే మాత్రం పిచ్‌ది తప్పవుతుందా’ అని కోహ్లి ఘాటుగా వ్యాఖ్యానించాడు.  
 
 అక్కడ జరగలేదా?
 1996 డర్బన్ టెస్టులో అలెన్ డొనాల్డ్ (9/54) ధాటికి భారత్ రెండు ఇన్నింగ్స్‌లలో 100, 66 పరుగులకే కుప్పకూలింది. మొత్తం కలిపి మన బ్యాటింగ్ 73.2 ఓవర్లే సాగింది. ఈ మ్యాచ్ గురించే కాకపోయినా కోహ్లి అక్కడి పిచ్‌లు, ఆ సమయంలో ఎవరూ విమర్శించని విషయాన్ని గుర్తు చేయడం విశేషం. అతని వాదనలోనూ వాస్తవం కనిపిస్తుంది. ‘సఫారీ గడ్డపై 50లోపు స్కోరు మూడు సార్లు నమోదైంది. ఆరు సార్లు 100 లోపే జట్లు ఆలౌట్ అయ్యాయి. కానీ నాడు పిచ్ గురించి ఎవరూ ఇంతగా రాయలేదు. అడిలైడ్ టెస్టు రెండున్నర రోజుల్లోపే ముగిసినా ఒక్క కథనం నాకు కనిపించలేదు. ఇప్పటికే దీని గురించి ఎక్కువగా మాట్లాడారు. ఇకపై ఏమీ చెప్పదల్చుకోలేదు’ అని కుండబద్దలు కొట్టాడు.
 
 శాస్త్రి-హేడెన్ మాటల యుద్ధం
 నాగ్‌పూర్ పిచ్ మాజీ ఆటగాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టింది. తొలి రోజే బంతి టర్న్ కాకూడదని ఏ నిబంధనల పుస్తకంతో రాసి ఉందంటూ ప్రశ్నించిన రవిశాస్త్రి... ఆస్ట్రేలియాలో కూర్చొని ఇక్కడి పిచ్‌లపై మాట్లాడవద్దంటూ, వచ్చి ఆడాలని మాజీలకు సవాల్ విసిరారు. అయితే తనకా హక్కు ఉందంటూ మ్యాథ్యూ హేడెన్ దానిని తిప్పికొట్టారు. తాను 103 టెస్టులు ఆడానని.. క్రికెట్‌ను ప్రేమించే, ఆట బాగు పడాలని కోరుకునే తనలాంటి వారే పిచ్ గురించి మాట్లాడతారని హేడెన్ గుర్తు చేశారు. మరో వైపు మ్యాచ్ ఫలితం ఆటగాళ్ల చేతిలో ఉంటుందని, క్యురేటర్ ఏమీ చేయలేడని బీసీసీఐ పిచెస్ కమిటీ చైర్మన్ దల్జీత్ సింగ్ స్పష్టం చేశారు. క్రికెటర్లు సరిగా ఆడకపోతే  పిచ్‌లపైనే చర్చ వస్తుందన్న దల్జీత్...‘దేవుడు దయతలిస్తే ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు’ అంటూ ఢిల్లీ పిచ్‌పై వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Advertisement

తప్పక చదవండి

Advertisement